Raj Gopal Reddy: 

Raj Gopal Reddy: తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ మాత్రమేనా?.. రాజగోపాల్ రెడ్డి సూటి ప్రశ్నలు

Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల కేటాయింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తీవ్ర పక్షపాతం చూపుతున్నారంటూ సొంత ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం (నవంబర్ 18) మునుగోడులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. తన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు కేటాయించకపోతే రాబోయే రోజుల్లో సర్కారుతో ‘కురుక్షేత్రం’ తప్పదని హెచ్చరించారు.

తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ మాత్రమేనా?.. రాజగోపాల్ రెడ్డి సూటి ప్రశ్నలు

గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకే నిధులు కుమ్మరించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తరహా సంస్కృతి కొనసాగుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

  • మూడు నియోజకవర్గాలకే నిధులా?: సీఎం రేవంత్ రెడ్డి తన కొడంగల్‌పై, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌పై, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరపై మాత్రమే ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ మాత్రమేనా? కొడంగల్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు తీసుకెళ్తున్న ప్రభుత్వం.. ఫ్లోరైడ్ బారినపడి అల్లాడుతున్న మునుగోడు చెరువులు, కుంటలను బాగుచేసేందుకు రూ. 500 కోట్లు కూడా ఇవ్వకపోవడం దారుణం అని మండిపడ్డారు.

  • డిండి ఎత్తిపోతల, చౌటుప్పల్ ఆసుపత్రిపై ఆగ్రహం: డిండి ఎత్తిపోతల పథకం పనులు మూడేళ్లుగా పడకేయడంతో నల్గొండ ప్రజల ప్రయోజనాలను బలిపెడుతున్నారని, చౌటుప్పల్ 100 పడకల ఆసుపత్రి హామీ ఇప్పటికీ అటకెక్కి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఉన్న సిటీకే గతి లేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు?: ఉన్న సిటీకే గతి లేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకని  ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్ర కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని, ఆయన పాలనలో ఎవరూ సంతోషంగా లేరని ఆరోపించారు.

పండబెట్టి తొక్కుతా’ అనడం ముఖ్యమంత్రికి తగదు!.. సీఎం భాషపై విమర్శలు

పార్టీ అంతర్గత సమావేశాల్లో వినతిపత్రాలు సమర్పిస్తే బుట్టదాఖలు చేస్తున్నారని, ప్రజల ముందు ప్రశ్నిస్తే క్రమశిక్షణ చర్యల పేరిట నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • తండ్రి పాత్ర పోషించాలి: కాలం, అదృష్టం కలిసి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించిన ఆయన.. మిగిలిన రెండేళ్ల కాలం అందరినీ సమానంగా చూస్తూ తండ్రి పాత్ర పోషించాలని సూచించారు.

  • భాషపై అభ్యంతరం: కొడంగల్‌కు కేటాయించే నిధులపై నిలదీస్తే ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ మాట్లాడటం ఒక ముఖ్యమంత్రికి తగదని హితవు పలికారు. పదవుల కోసం తాను ఎవరి ఇంటి చుట్టూ తిరగనని, తనకు రావాల్సి ఉంటే అదే వస్తుందని స్పష్టం చేశారు.

  • సంక్షేమ పథకాలపై డిమాండ్లు: ప్రభుత్వం ఉన్నది పేదల కోసమే తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి.. అర్హులైన వారందరికీ పింఛన్లను వెంటనే రూ. 5,000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతు బంధును హైదరాబాద్‌లో ఉండి ఉద్యోగాలు చేసే వారికి కాకుండా, నిజమైన సాగు చేసే రైతులు, కౌలు రైతులకు ఇవ్వాలని సూచించారు. నాడు వైఎస్సార్ మాట తప్పం, మడమ తిప్పమని పాలన చేసి చూపించారని గుర్తుచేస్తూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *