AP News

AP Semiconductor Policy: దేశంలోనే చిప్ తయారీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్.. తిరుపతిలో 5 వేల ఎకరాల్లో భారీ సెమీకండక్టర్ పార్క్!

AP Semiconductor Policy: ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ (Semiconductor) తయారీ రంగంలో దేశంలోనే కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకొచ్చింది. ప్రపంచ స్థాయి చిప్ తయారీ దిగ్గజాలను రాష్ట్రానికి ఆకర్షించడం, యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0’ సవరణలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంలో భాగంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సెమీకండక్టర్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఏపీ సెమీకండక్టర్ పాలసీ 4.0 – ప్రధాన ఆకర్షణలు & రాయితీలు..

  • 80% వరకు పెట్టుబడి మద్దతు: సిలికాన్ ఫ్యాబ్‌ల (Silicon Fabs) ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కలిపి 80 శాతం వరకు పెట్టుబడి రాయితీ అందించనున్నారు. అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, ఇతర ఫ్యాబ్ పరిశ్రమలకు 70 శాతం వరకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. ఉదాహరణకు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో సిలికాన్ చిప్ పరిశ్రమ పెడితే కేంద్రం రూ. 400 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లు సమకూరుస్తాయి.. అంటే పెట్టుబడిదారుడి వాటా కేవలం రూ. 200 కోట్లు మాత్రమే అవుతుంది!

  • ఆరు విభాగాలకు ప్రత్యేక ప్రోత్సాహం: చిప్ డిజైన్, తయారీ యంత్రాలు, ముడి పదార్థాల సరఫరా, ఫ్యాబ్‌ల ఏర్పాటు, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, పరిశోధన (R&D) వంటి ఆరు కీలక విభాగాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

  • విద్యుత్‌పై యూనిట్‌కు రూ. 3 రాయితీ: సెమీకాన్ 2.0 పరిధిలోకి రాని అర్హత కలిగిన సెమీకండక్టర్ పరిశ్రమలకు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి ఐదేళ్లపాటు ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ. 3 రాయితీ ఇవ్వనున్నారు.

  • మెగా & అల్ట్రా మెగా ప్రాజెక్టుల హోదా: రూ. 1,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ‘మెగా ప్రాజెక్టుల’ హోదా, రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు ‘అల్ట్రా మెగా ప్రాజెక్టుల’ హోదా కల్పించి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తారు.

యువతకు నెలకు రూ. 10 వేల శిక్షణ భృతి – 3 ప్రత్యేక సంస్థల ఏర్పాటు!

  • నెలకు రూ. 10 వేల స్టైపెండ్: చిప్ డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ విభాగాల్లో నైపుణ్య శిక్షణ పొందే ఒక్కో అభ్యర్థికి ఆరు నెలలపాటు నెలకు రూ. 10,000 చొప్పున భృతి (Stipend) అందించనున్నారు.

  • మూడు ప్రత్యేక సంస్థలు: పెట్టుబడులను వేగవంతం చేసేందుకు APSGIC (అభివృద్ధి, పెట్టుబడుల సమన్వయ మండలి), పరిశోధనల కోసం AP-SRIC, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు AP-STCC సంస్థలను ఏర్పాటు చేయనున్నారు.

  • తిరుపతి పార్క్‌లో ప్రపంచస్థాయి సదుపాయాలు: 5 వేల ఎకరాల్లో నిర్మించే తిరుపతి సెమీకండక్టర్ పార్కులో నిరంతర విద్యుత్, స్వచ్ఛమైన నీరు, క్లీన్‌రూమ్ సదుపాయాలు, ప్రత్యేక పారిశ్రామిక గ్యాస్‌లు, రసాయనాల సరఫరా, వ్యర్థజలాల శుద్ధి, రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *