Tragedy

Tragedy: కొత్త పెళ్లికూతురు కోసం ఇల్లు ముస్తాబు చేస్తుండగా..

Tragedy: కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువకుడిని విధి కబళించింది! పెళ్లి ఏర్పాట్లు, బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. కళ్లముందే చేతికందిన కొడుకు విగతజీవుడిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాపట్ల జిల్లా మార్టూరు పట్టణ పరిధిలోని ఆది జాంబవ కాలనీలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

కొత్త పెళ్లికూతురు కోసం ఇల్లు ముస్తాబు చేస్తుండగా..

  • వచ్చే నెల 13న వివాహం: మార్టూరు ఆది జాంబవ కాలనీకి చెందిన పెద్దకర్ని యశ్వంత్ (22) అనే యువకుడికి వచ్చే నెల (డిసెంబర్) 13న వివాహం నిశ్చయమైంది. దీంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

  • ఐరన్ పైపు విద్యుత్ తీగలకు తగిలి: కొత్త పెళ్లికూతురు అడుగుపెట్టబోయే తమ ఇల్లు అన్ని హంగులతో, సౌకర్యాలతో అందంగా ఉండాలని యశ్వంత్ ఎంతో ఆశపడ్డాడు. ఇందులో భాగంగానే స్వయంగా తానే ఇంటికి అవసరమైన మరమ్మతు పనులు ప్రారంభించాడు. ఈ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు యశ్వంత్ చేతిలోని ఐరన్ పైపు పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది.

  • అక్కడికక్కడే మృతి: క్షణాల వ్యవధిలో తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురైన యశ్వంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ఘోరం జరగడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే యశ్వంత్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

శోకసముద్రంలో ఆది జాంబవ కాలనీ!

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా చావు డప్పు మోగడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్న వయసులోనే నూరేళ్ల జీవితంపై ఎన్నో కలలు కన్న యశ్వంత్ అర్ధాంతరంగా తనువు చాలించడం మార్టూరులో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *