ఐఎండీ తాజా హెచ్చరికలు – 145 కి.మీ. వేగంతో గాలులు, 6 జిల్లాలకు స్టార్మ్ సర్జ్ ముప్పు!
-
ప్రస్తుత స్థితి: నవంబర్ 18 ఉదయం 5:30 గంటల సమయానికి ‘అక్వాన్’ తీవ్ర తుఫాన్ గంటకు 3 కి.మీ. వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ.. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 610 కి.మీ., విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 610 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
-
గంటకు 145 కి.మీ. వరకు పెనుగాలులు: తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో (గరిష్టంగా 120 కి.మీ.) గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే తీరప్రాంత హెచ్చరికల ప్రకారం నవంబర్ 19 రాత్రి నుంచి తీరం దాటే వరకు గంటకు 120–130 కి.మీ., ఒక్కోసారి 145 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది.
-
1–2 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు (Storm Surge): సాధారణ ఆటుపోట్ల కంటే 1 నుంచి 2 మీటర్ల ఎత్తున సముద్రం ఉప్పొంగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీనివల్ల ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల లోతట్టు తీర ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది.
-
అత్యంత భారీ వర్షాలు: నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు (Isolated Extremely Heavy Rainfall) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
యుద్ధప్రాతిపదికన ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లు – 30,808 బోట్లపై నిఘా!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలను ముమ్మరం చేసింది.
-
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ & ఎస్డీఆర్ఎఫ్: తుఫాన్ ప్రభావిత జిల్లాలైన నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు సున్నిత ప్రాంతాల్లో NDRF, SDRF బృందాలను మోహరించారు.
-
విద్యుత్ పునరుద్ధరణకు ముందస్తు స్టాక్: పెనుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లను సిద్ధంగా ఉంచారు.
-
మత్స్యకారులకు 1.08 లక్షల వాయిస్ అలర్ట్స్: రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి ఉన్న 30,808 రిజిస్టర్డ్ చేపల వేట బోట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇంకా సముద్రంలో ఉన్న బోట్లను వెనక్కి రప్పిస్తుండగా, మత్స్యకార గ్రామాలకు ఇప్పటికే 1.08 లక్షలకు పైగా వాయిస్ అలర్ట్స్ పంపించారు. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఐఎండీ స్పష్టం చేసింది.
-
రైతులకు కీలక సూచన: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పంట నష్టాన్ని నివారించేందుకు చేతికొచ్చిన పంటలను వెంటనే కోసుకోవాలని, పొలాల్లో నీరు నిలవకుండా మురుగునీటి కాలువలను శుభ్రం చేసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు.
