Amit Shah: విజయవాడ వేదికగా అత్యంత వైభవంగా జరిగిన ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ (Ramoji Excellence Awards Ceremony 2026) ప్రదానోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) దివంగత రామోజీరావుపై ప్రశంసల వర్షం కురిపించారు! రామోజీరావు 90వ జయంతి సందర్భంగా 9 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేసిన ఆయన.. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని, అనుకోకుండా జరిగిన తొలి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రామోజీరావుతో తన తొలి పరిచయం ఎలా జరిగిందో అమిత్ షా వివరించారు.
-
అనుకోని పరిచయం: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తుండగా ట్రాఫిక్ కారణంగా మధ్యలోనే నా కారు ఆగిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, రామోజీరావు తమ కారులో నన్ను ప్రమాణ స్వీకారోత్సవానికి తీసుకెళ్లారు. ఆ విధంగా మా పరిచయం మొదలైంది అని అమిత్ షా గుర్తుచేసుకున్నారు.
-
ప్రతిసారీ ఆశ్చర్యపరిచేవారు: బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్ర హోంమంత్రిగా రామోజీరావును మొత్తం నాలుగుసార్లు కలిశానని, కలిసిన ప్రతిసారీ ఆయన మేధస్సు, అవగాహన చూసి ఆశ్చర్యపోయేవాడినని తెలిపారు. ఏ సమస్యకైనా రామోజీరావు వద్ద స్పష్టమైన పరిష్కారం, స్థిరత్వం ఉండేవని కొనియాడారు.
హిందీ రాకపోయినా యూపీ ఎన్నికల ఫలితాలను ముందే అంచనా వేశారు!
-
యూపీ ఎన్నికలు & ఆర్టికల్ 370: ఒకసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి చర్చ వచ్చింది. నేను యూపీలో ప్రతి మారుమూల ప్రాంతం తిరిగి ఇంటింటికీ ప్రచారం చేశాను. కానీ, అసలు హిందీ భాషే రాని రామోజీరావు.. యూపీ రాజకీయాలపై సమగ్రంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో సులువుగా చెప్పేశారు. చివరికి ఆయన చెప్పినట్లే ఫలితాలు రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను అని అమిత్ షా అన్నారు.
-
దేశ సమస్యలకు ఒక అడ్వైజర్లా..: ఆర్టికల్ 370 రద్దు, ఈశాన్య రాష్ట్రాల్లోని విభజనవాదం, వాటి మూలకారణాలు అన్నీ ఆయన చేతివేళ్లపై ఉండేవని.. దేశంలోని సమస్యల పరిష్కారానికి ఒక సలహాదారు ఉండాలనుకుంటే అది రామోజీరావు రూపంలోనే కనిపించేవారని ప్రశంసించారు.
రామ్నాథ్ గోయెంకాతో పోల్చదగ్గ మహనీయుడు!
- కృషి, దార్శనికత: కృష్ణా జిల్లాలోని ఒక సాధారణ గ్రామంలో పుట్టి, ఎలాంటి వారసత్వ ఆస్తులు, జర్నలిజం డిగ్రీ లేకపోయినా కేవలం కఠోర శ్రమ, దార్శనికతతో రామోజీరావు ఎదిగారని అమిత్ షా కొనియాడారు.
- విలువల కోసం రాజీలేని పోరాటం: ప్రతి ఉదయం తెలుగు ప్రజలకు నిజాన్ని అందించాలనే తపనతో పనిచేసిన ఆయనను రామ్నాథ్ గోయెంకా లాంటి దిగ్గజాలతోనే పోల్చగలమని అన్నారు. 24 గంటల ప్రాంతీయ న్యూస్ ఛానళ్లకు శ్రీకారం చుట్టి, ఆర్థిక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ విలువల కోసం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు అని అమిత్ షా నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా సినీ రంగానికి, మార్గదర్శి, ఈనాడు సంస్థల ద్వారా సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
