Rahul Gandhi: హైదరాబాద్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ‘తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీ’ని ఆవిష్కరించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ విధానాలు కేవలం బడా కంపెనీల లాభాలకే ప్రాధాన్యత ఇస్తూ గిగ్ వర్కర్లను వెట్టిచాకిరీ కార్మికులుగా మారుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. “మిమ్మల్ని బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం.. దేశ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములుగా చేస్తాం” అంటూ గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ గట్టి భరోసా ఇచ్చారు!
తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీలోని 5 సూపర్ హైలైట్స్ ఇవే!
రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు అందబోయే ప్రధాన ప్రయోజనాలు ఇవే:
-
ప్రతి డెలివరీపై 1% సంక్షేమ నిధి (Welfare Fund): కస్టమర్లకు చేసే ప్రతి డెలివరీపై 1 శాతం మొత్తాన్ని గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి కేటాయిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గిగ్ వర్కర్స్ బోర్డు’ ద్వారా ఈ డబ్బు నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
-
వైఫై (Wi-Fi) సౌకర్యంతో కూడిన విశ్రాంతి భవనాలు: ఎండలో, వానలో ఆర్డర్ల కోసం వేచి చూస్తూ రోడ్ల పక్కన ఇబ్బంది పడే గిగ్ వర్కర్ల కోసం నగరంలో ప్రత్యేకంగా విశ్రాంతి భవనాలను (Rest Houses) నిర్మించనున్నారు. వీటిలో ఉచిత వైఫై, మంచినీరు, వాష్‌రూమ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
-
మొబైల్ ఫోన్లోనే పారదర్శక లెక్కలు: ఇప్పటివరకు తాము చేసిన పనికి కంపెనీలు ఎంత కమిషన్ తీసుకుంటున్నాయి, తమకు ఎంత ప్రతిఫలం దక్కుతోందనే స్పష్టత ఉండేది కాదు. కొత్త విధానం ద్వారా ప్రతి డెలివరీ, ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వర్కర్లు నేరుగా తమ మొబైల్ ఫోన్లలోనే చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
-
రూ. 5 లక్షల ప్రమాద బీమా & రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ: విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగితే కుటుంబానికి అండగా ఉండేలా రూ. 5 లక్షల ప్రమాద బీమా, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది.
-
పెన్షన్, పొదుపు & సామాజిక భద్రత: గిగ్ వర్కర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా పెన్షన్, పొదుపు పథకాలపై కూడా ఈ పాలసీలో ప్రత్యేక దృష్టి సారించారు. వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ బోర్డు పనిచేయనుంది.
“గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం!” – రాహుల్ గాంధీ & సీఎం రేవంత్..
గతంలో గిగ్ వర్కర్లు తనను కలిసి తమ ఆవేదన చెప్పుకున్నప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చామని రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల కుటుంబాల విద్య, వైద్యం, ఆర్థిక భద్రతకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఈ చట్టం దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు.
