Harish Rao: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయహస్తం’లోని హామీల అమలు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు టి. హరీశ్ రావు, కేటీఆర్ శనివారం సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’ (X) లో వేర్వేరు పోస్టుల ద్వారా ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
పాత హామీలనే మళ్లీ బడ్జెట్లో తిరగబోస్తున్నారు!.. హరీశ్ రావు విమర్శలు..
హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల పనితీరుపై సమీక్ష జరిపి లెక్క అడగాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆయన తన పోస్టులో ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవే.
-
మహనీయుల పేర్లు పెడితే సరిపోదు: ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు ప్రకటిస్తే సరిపోదని, ఆ హామీలను అమలు చేసినప్పుడే వారికి నిజమైన గౌరవం దక్కుతుందని హరీశ్ రావు అన్నారు. అమలుకు నోచుకోని పథకాలకు వారి పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు.
-
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏమైంది? భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందిస్తామని 2024-25 బడ్జెట్లో ప్రకటించి, ఆ తర్వాత 2025-26 బడ్జెట్లోనూ గొప్పలు చెప్పుకున్నారని.. కానీ వరుసగా మూడు బడ్జెట్లు పూర్తయినా నేటికీ నిరుపేద కూలీలకు ఆ సాయం అందలేదని హరీశ్ రావు ఆరోపించారు.
-
కావాల్సింది జిమ్మిక్కులు కాదు: ‘రాజీవ్ యువ వికాసం’ బడ్జెట్ కాగితాలకే పరిమితమైందని, పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్లో తిరగబోస్తూ పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ ఫార్ములాగా మారిందని విమర్శించారు.
“420 హామీలు, 13 డిక్లరేషన్లపై రాహుల్ సమాధానం చెప్పాలి!” – కేటీఆర్ డిమాండ్:
మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్ర ఖజానా ఖర్చుతో హైదరాబాద్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు:
-
బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు: బీసీ సంక్షేమానికి ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఇస్తామని చెప్పి మూడేళ్లలో రూ. 5 వేల కోట్ల లోపే కేటాయించారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ‘సున్నా’ అని కేటీఆర్ ఆరోపించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షల ‘అంబేద్కర్ అభయహస్తం’, కాంట్రాక్టుల్లో 31 శాతం వాటా హామీల అమలులోనూ పురోగతి లేదన్నారు.
-
నిరుద్యోగులు & మైనారిటీలు: ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10 వేల ఉద్యోగాలే ఇచ్చారని, విద్యార్థులకు రూ. 5 లక్షల ‘విద్యా భరోసా కార్డు’ ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి రూ. 4 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి రూ. వెయ్యి కోట్ల లోపే ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.
