IVF Scam: సిటీలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయంటే ఎవరైనా ఆశపడతారు.. అందులోనూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులైతే ఎలాగైనా జాబ్ సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని చూస్తారు. సరిగ్గా అమ్మాయిల ఇదే అవసరాన్ని, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ హైదరాబాద్ కేంద్రంగా ఒక ముఠా నడుపుతున్న చీకటి దందా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది! ఉద్యోగాల పేరుతో ఆరు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి, వారికి డబ్బు ఆశ చూపి.. మత్తు, హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అక్రమంగా ‘అండాలు’ (Eggs) సేకరిస్తున్న రాకెట్ గుట్టురట్టయింది. మల్కాజిగిరి పోలీసుల దర్యాప్తులో ఈ దందా వెనుక ఉన్న రూ. కోట్ల వ్యాపారం, నకిలీ పత్రాల బాగోతం చూసి అధికారులే షాక్ అవుతున్నారు.
ఒక్క సెంటర్ టర్నోవర్ ₹2 కోట్లు – 21 ఐవీఎఫ్ కేంద్రాలపై అనుమానం..
గత నెల 29న బేగంపేట, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కేవలం ఒకే ఒక్క ఏఆర్టీ (ART – Assisted Reproductive Technology) కేంద్రం టర్నోవర్ ఏడాదికి రూ. 2 కోట్లకు పైగా ఉన్నట్లు మల్కాజిగిరి పోలీసులు గుర్తించారు. ఈ దందాలో మొత్తం 21 ఐవీఎఫ్ (IVF) కేంద్రాల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే బేగంపేట, తుకారాంగేట్, మహంకాళి, గోపాలపురం, బోయిన్పల్లి పరిధిలోని 8 ఐవీఎఫ్ కేంద్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక రికార్డులు స్వాధీనం చేసుకుని, ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు.
పెళ్లికాని అమ్మాయిలే టార్గెట్ – ఆధార్ కార్డుల ఫోర్జరీ!
ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద నేతృత్వంలో జరిగిన విచారణలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి.
-
జాబ్స్ పేరుతో ఎర: ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఉద్యోగాలంటూ పేద యువతులను హైదరాబాద్ రప్పించి, ఆ తర్వాత “అండాల దానం చాలా చిన్న విషయం, ఎలాంటి నొప్పి ఉండదు” అని నమ్మించి ఒక్కొక్కరికి రూ. 30 వేల ఆశ చూపించి ఈ కూపంలోకి దించుతున్నారు.
-
90% పెళ్లికాని యువతులే: ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 43 నుంచి 50 మంది బాధితులను పోలీసులు రక్షించగా, వారిలో దాదాపు 90 శాతం మంది పెళ్లికాని యువతులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
-
ఫోర్జరీ ఆధార్, నకిలీ సంతకాలు: చట్టప్రకారం అండాల దానానికి కొన్ని కఠిన నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పించుకోవడానికి నిందితులు ఏకంగా బాధిత యువతుల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి వారి వయసు, గుర్తింపును మార్చేశారు. మహిళల పూర్తి అంగీకారంతోనే అండాలు తీసుకున్నట్లు నమ్మించేందుకు నకిలీ అగ్రిమెంట్లు సృష్టించారు.
5 రోజుల పోలీస్ కస్టడీ – ‘హుస్సేన్’ కోసం వేట..
ఈ రాకెట్లో కీలకంగా వ్యవహరించిన మునగపాటి ప్రవీణ్ సహా ఇప్పటివరకు మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రవీణ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, రెండు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వాటిలో బాధిత యువతుల వివరాలు, డబ్బు లావాదేవీల చిట్టా దొరికే అవకాశం ఉంది.
విచారణలో భాగంగా నిందితులను మల్కాజిగిరి పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. మహిళలను తీసుకొచ్చే ఏజెంట్లు, మధ్యవర్తులు, డాక్టర్ల పాత్రపై లోతుగా ప్రశ్నిస్తున్నారు.మరోవైపు, ఈ మొత్తం చీకటి సామ్రాజ్యానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ‘హుస్సేన్’ అనే వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది.
సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా ఇలా పదేపదే హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఆ యువతుల ఆరోగ్యం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన ఐవీఎఫ్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.
