AP High Court: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసుల కాల్పుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చికిత్స సమయంలో నిందితుడి కి తొలగించిన కాలు భాగాన్ని భద్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
హేమంత్ మోకాళ్ల కింది భాగంలో పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై నిష్పక్షపాతంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపికృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌తో పాటు, శస్త్రచికిత్స ద్వారా తొలగించిన నిందితుడి కాలును ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం భద్రపరచాలంటూ పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
తొలగించిన కాలును భద్రపరచాలన్న విజ్ఞప్తిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అధికారులకు ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో, ఈ కేసులో పాఠశాల విద్యాశాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.
