Vijaysai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నేత వి. విజయసాయిరెడ్డి సొంత రాజకీయ పార్టీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయవాడ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నూతన పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (Parivarthana Rajaneethi Party – PRP)గా అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను కూడా ఘనంగా ఆవిష్కరించారు.
గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, వైఎస్సార్‌సీపీలో నంబర్ టూ స్థానంలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి.. ఇటీవల కాలంలో ఆ పార్టీతో పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీనే స్థాపించి రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. విజయసాయిరెడ్డి ఆవిష్కరించిన పార్టీ జెండాలో తెలుపు, కాషాయ రంగులతో పాటు మధ్యలో ధర్మచక్రం గుర్తును పొందుపరిచారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన, మార్పు కోరుకునే రాజకీయాల కోసమే ఈ ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం పార్టీ’ని సంక్షిప్తంగా పీఆర్పీ (PRP) అని పిలిచేవారు కాగా, సరిగ్గా అదే అక్షరాల కలయికతో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు తెరపైకి రావడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
