బెట్టింగ్ ఊబిలోకి.. రూ. 20 లక్షల అప్పులు..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామానికి చెందిన ముడావత్ శ్రీను (31) 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ రీత్యా భార్య సుమిత్రతో కలిసి మాన్సన్పల్లి ఎక్స్ రోడ్స్ వద్ద అద్దెకు ఉంటున్నారు. అయితే, శ్రీనుకు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు ఆడే అలవాటు (ముఖ్యంగా PlayInJeet.com వంటి సైట్లలో) ఉంది.
మొదట్లో గెలుస్తున్నట్లే అనిపించినా, రానురాను భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బుల కోసం రకరకాల లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేశాడు. గతంలో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేస్తే.. తల్లి, గ్రామస్థులు కలిసి కష్టపడి తీర్చేశారు. పెళ్లయిన తర్వాత మళ్లీ అదే బెట్టింగ్ పిచ్చితో మరో రూ.10 లక్షల అప్పు చేయగా, అత్తమామలు సర్దిచెప్పి ఆ మొత్తాన్ని చెల్లించారు. ఎంత చెప్పినా ఆ అలవాటు నుంచి బయటపడలేక శ్రీను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.
రూ.20 వేల లోన్‌కు నరకం చూపించిన ‘రూపీ ఫ్లో’..
సెలవుపై స్వగ్రామం హర్షగూడకు వచ్చిన శ్రీను.. నవంబర్ మొదటి వారంలో ‘రూపీ ఫ్లో’ (Rupee Flow) అనే అక్రమ లోన్ యాప్ ద్వారా మరో రూ.20,000 అప్పు తీసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ మొత్తం రూ.40,500 అయ్యిందని, వెంటనే కట్టేయాలని లోన్ రికవరీ ఏజెంట్లు శ్రీనుపై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, శ్రీను మొబైల్ కాంటాక్ట్స్, గ్యాలరీ డేటాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి విదేశీ నంబర్ల (+8801790655208, +923326558182) నుంచి వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టారు.
శ్రీను అత్త, మామ, భార్య, కుటుంబ సభ్యుల ముఖాలను అసభ్యకరమైన నగ్న ఫొటోలకు అతికించి (Morphing) శ్రీనుకు పంపించారు. “వెంటనే డబ్బులు కట్టకపోతే ఈ ఫొటోలను నీ కాంటాక్ట్స్ అందరికీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం” అంటూ బూతులు తిడుతూ దారుణంగా బ్లాక్మెయిల్ చేశారు.
పరువు పోతుందన్న భయంతో.. గదిలో ఉరేసుకుని..
సోమవారం ఉదయం శ్రీను మేనల్లుడికి లోన్ యాప్ నుంచి ఫోన్ రావడంతో అతడు శ్రీనుకు కాల్ చేశాడు. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇంటికెళ్లి చూడగా గది లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో కిటికీ పగులగొట్టి చూసేసరికి.. శ్రీను చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. స్థానికులు వెంటనే తలుపులు బద్దలుకొట్టి కిందకు దించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
రంగంలోకి పోలీసులు – కేసు నమోదు..
శ్రీను తల్లి ముడావత్ గోరి ఇచ్చిన కంప్లైంట్ మేరకు పహాడీషరీఫ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన విదేశీ వాట్సాప్ నంబర్లు, ‘రూపీ ఫ్లో’ యాప్ మూలాలు, అలాగే బెట్టింగ్ జరిగిన వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ టీమ్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.
సైబర్ పోలీసుల కీలక హెచ్చరిక..
ఆన్లైన్ లోన్ యాప్‌ల విషయంలో ప్రజలు అస్సలు భయపడొద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్లేస్టోర్‌లో లేదా లింకుల రూపంలో వచ్చే ఆర్బీఐ (RBI) అనుమతి లేని ఏ లోన్ యాప్‌లకూ మీ ఫోన్ పర్మిషన్లు (కాంటాక్ట్స్, గ్యాలరీ) ఇవ్వకండి.
ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలతో ఎవరైనా బెదిరింపులకు దిగితే తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి లేదా దగ్గర్లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి.