Train Accident: ఉదయాన్నే నిద్ర కళ్లతో ఉన్న ప్రయాణికులకు ఒక్కసారిగా గుండె గుభేలుమనే సీన్! ఏదో చిన్న కుదుపు అనుకునే లోపే.. భయంకరమైన శబ్దంతో రైలు బోగీలు ట్రాక్ తప్పి పక్కకు ఒరిగాయి. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపే లోపల ఉన్న లగేజీలు, మనుషులు చెల్లాచెదురుగా పడిపోయారు. అస్సాంలోని కామరూప్ జిల్లా పరిధిలో బుధవారం తెల్లవారుజామున కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఇంజన్‌తో పాటు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో జనాలు ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగింది? ఎక్కడ జరిగింది?
మిజోరంలోని ఐజ్వాల్ సమీపంలో ఉన్న సైరాంగ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళ్తున్న కోల్‌కతా–సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. అస్సాం గౌహతి సమీపంలోని దిగారు (Digaru) రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. బుధవారం ఉదయం సరిగ్గా 6:54 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్ సమీపంలో మరో రైలుకు లైన్ క్లియర్ ఇచ్చే (Precedence) క్రమంలో.. లోకో పైలట్ ట్రైన్ స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో రైలు ఒక్కసారిగా ట్రాక్ తప్పినట్లు ప్రాథమికంగా తెలిసింది.ఈ ధాటికి రైలు ఇంజన్‌తో పాటు దాదాపు 6 నుంచి 7 బోగీలు ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి.
నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా హాహాకారాలు!
తెల్లవారుజాము సమయం కావడంతో ఎక్కువమంది ప్రయాణికులు తమ బెర్తులపై గాఢనిద్రలో ఉన్నారు. మరికొందరు అప్పుడే లేచి బ్రష్ చేసుకోవడం, చాయ్ తాగడం లాంటి పనుల్లో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద కుదుపుతో కూడిన శబ్దం రావడంతో బోగీల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సీట్ల మీద నుంచి జనాలు కింద పడిపోయారు. కొందరికి చిన్న చిన్న గీతలు, స్వల్ప గాయాలయ్యాయి తప్ప ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.
రంగంలోకి దిగిన రైల్వే టీమ్స్.. ఆల్టర్నేట్ ట్రైన్ ఏర్పాటు..
ప్రమాద వార్త తెలిసిన వెంటనే నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నాయి. ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్వో కపింజల్ కిషోర్ శర్మ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను ఖాళీ చేయించి, వారిని తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ వెంటనే మరో ప్రత్యామ్నాయ రైలును (Alternate Train) సిద్ధం చేసింది.
దెబ్బతిన్న ట్రాక్‌ను క్లియర్ చేసి, సర్వీసులను సాధారణ స్థితికి తెచ్చేందుకు రైల్వే ఇంజినీరింగ్ సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.ఈ ఘటనకు లోకో పైలట్ వేగ నియంత్రణే కారణమా లేక ట్రాక్‌లో ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నాయా అనే కోణంలో ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
