Viral News

Viral News: పెళ్లికూతురిని ని 18 కిలోమీటర్ల నడిపించిన పెళ్లికొడుకు.. వీడియో వైరల్..!

Viral News: వివాహం తర్వాత నవవధువును అత్తారింటికి తోడ్కొని వెళ్లడానికి పూల రథాలు, డప్పు చప్పుళ్లు, భారీ ఊరేగింపులు, కార్ల కాన్వాయ్‌లు ఏర్పాటు చేయడం సహజం. అయితే ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక నవవధువుకు మాత్రం అత్యంత విచిత్రమైన, కష్టతరమైన అనుభవం ఎదురైంది. బరాత్‌లు, ఊరేగింపులు పక్కన పెడితే.. ఏకంగా అత్తారింటికి చేరుకోవడానికే ఆమె పెళ్లి దుస్తుల్లో 18 కిలోమీటర్ల మేర రాళ్లురప్పల కొండదారిలో కాలినడకన ప్రయాణించాల్సి వచ్చింది.

అసలేం జరిగింది? లోఖండి నుంచి ఉండవా గ్రామానికి పాదయాత్ర..

ఉత్తరాఖండ్‌లోని చక్రాటా పరిధిలోని బల్హార్‌ గ్రామానికి చెందిన షర్మిలకు, డెహ్రాడూన్‌ సమీపంలోని మారుమూల కొండ ప్రాంతమైన ఉండవా గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవల వివాహం జరిగింది.పెళ్లి తంతు ముగిసిన తర్వాత లోఖండి వద్ద వాహనాలు ఆగిపోయాయి. అక్కడి నుంచి అత్తారిల్లు ఉన్న ఉండవా గ్రామానికి ఎలాంటి రోడ్డు మార్గం లేదు. గృహప్రవేశం శుభ ముహూర్తానికి చేరుకోవాలనే ఆత్రుతతో, వధువు షర్మిల బరువైన పెళ్లి లెహంగా, బంగారు ఆభరణాలు ధరించి కొండ ప్రాంతంలోని రాళ్లూరప్పల బాటలో ఏకంగా 18 కిలోమీటర్లు వేగంగా నడిచింది.

ఏ ఆడపిల్లకూ ఈ పరిస్థితి రావొద్దు.. సీఎంకు వధువు వీడియో విజ్ఞప్తి

ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తోటి గ్రామస్థులు తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. నడకతో తీవ్రంగా అలసిపోయిన ఆ నవవధువు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి నేరుగా వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేసింది.

నాలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ ఆడపిల్లకూ రాకూడదు. ముఖ్యమంత్రి గారూ.. దయచేసి మా అత్తారి గ్రామానికి తక్షణమే రోడ్డు వేయించండి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఉండవా వంటి గ్రామాలకు కనీస రోడ్డు సదుపాయం లేకపోవడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను షేర్ చేశారు.

కొండ ప్రాంతాల్లో నిత్యం ప్రజల కష్టాలు..

ఉత్తరాఖండ్‌లోని ఉండవా, హండి కండి వంటి కొండ ప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పెళ్లిళ్లతోనే ఆగిపోవడం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన రోగులు, వృద్ధులను డోలీలలో లేదా మోసుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది.వర్షాకాలం, ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు కనీసం సమీప ఆసుపత్రులకు చేరుకోవడం కూడా అసాధ్యంగా మారుతోంది.

స్పందించిన ముఖ్యమంత్రి.. రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు..

పెళ్లి దుస్తుల్లో నవవధువు పడిన కష్టాలు, ఆమె చేసిన విజ్ఞప్తి వీడియో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దృష్టికి చేరడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఉండవా గ్రామానికి అవసరమైన రోడ్డు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *