PM Modi: దేశంలో ఈవీఎంల విశ్వసనీయతపై తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తూ, మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల నాలుగు కీలక రాష్ట్రాల్లో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడాన్ని ఎత్తిచూపుతూ ప్రధాని సోషల్ మీడియా వేదికగా చురకలంటించారు.
“కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో ఊహించండి చూద్దాం?”: మోదీ ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ పరాజయాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు:
అంటూ బూతద్దం పెట్టి వెతుకుతున్నట్లుగా ఉండే ఒక ఎమోజీని (🔍) జత చేసి మోదీ చేసిన పోస్ట్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 12 చోట్ల పోటీ చేసి, గతంలో గెలిచిన నాలుగు స్థానాలను కూడా నిలుపుకోలేక ‘జీరో’ ఫలితాన్ని మూటగట్టుకుంది.
ఈవీఎం vs బ్యాలెట్ పేపర్: కాంగ్రెస్ వాదనకు చెక్
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీలను రద్దు చేసి దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా బ్యాలెట్ విధానంలో, విద్యావంతులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఓట్లేసే శాసనమండలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోవడంపై బీజేపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ఈవీఎంలను బూచిగా చూపి తప్పించుకునే ప్రయత్నాలు ఇక సాగవని ఎద్దేవా చేస్తున్నారు.
4 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవే:
- కర్ణాటక (4 స్థానాలు): అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇక్కడ గట్టి షాక్ తగిలింది. ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ గెలవలేకపోయింది. బీజేపీ 3 చోట్ల విజయం సాధించగా, మిత్రపక్షం జేడీఎస్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
- ఉత్తరప్రదేశ్: సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యత సాధించగా, ఎస్పీ కొన్ని చోట్ల విజయం సాధించింది.
- బీహార్: ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ‘జన్ సూరజ్ పార్టీ’ శాసనమండలిలో తొలిసారి బోణీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ జన్ సూరజ్, ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రాతినిధ్యం దక్కించుకోగా కాంగ్రెస్ ఖాళీగా మిగిలింది.
- మహారాష్ట్ర: అధికార మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన) మెజారిటీ స్థానాలను దక్కించుకోగా, ప్రతిపక్ష శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (ఎస్పీ) రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు ఫలితం దక్కలేదు.
ఈవీఎంలపై నిందలు వేస్తూ బ్యాలెట్ పేపర్ల పేరుతో ప్రజాక్షేత్రంలో సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పెద్ద బ్రేక్ వేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాలెట్ పోరులోనూ కాంగ్రెస్‌కు పరాభవమే ఎదురుకావడంపై ప్రధాని మోదీ సంధించిన వ్యంగ్యాస్త్రాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

