Chandrababu: రాష్ట్రంలో ‘అర్నబ్’ తుపాను సృష్టించిన నష్టం నుంచి ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి జిల్లాల్లోని పరిస్థితులను లైవ్ సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం తుపాను బాధితుల కోసం భారీ సహాయక (రిలీఫ్) ప్యాకేజీని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులపై పడిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు.
కేంద్ర హోంమంత్రితో చర్చలు.. ఏపీకి రానున్న కేంద్ర బృందం
తుపాను తీవ్రత, రాష్ట్రానికి జరిగిన ప్రాథమిక నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో స్వయంగా మాట్లాడిన చంద్రబాబు, పరిస్థితిని సమీక్షించేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపించాలని కోరారు.
నిత్యావసరాలు, పునరావాస సాయం వివరాలు
ముంపునకు గురైన కుటుంబాలకు, సహాయ శిబిరాల్లో ఉన్నవారికి ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించింది.ఇంట్లోకి నీళ్లు చేరిన కుటుంబాలకు: 25 కిలోల బియ్యం, కేజీ పప్పు, పామాయిల్, చక్కెర పంపిణీ.
చేనేత కార్మికులు, మత్స్యకారులకు: ప్రత్యేకంగా 50 కిలోల చొప్పున బియ్యం.
పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి: ప్రతి ఒక్కరికీ తక్షణ ఖర్చుల కోసం రూ. 1,000 నగదు సాయం.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి: ప్రత్యేక వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5,000 అందజేత.
ఆస్తులు, వ్యాపారాలు, వాహనాల నష్టపరిహారం..
చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, వాహనదారులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసింది:ఇళ్లకు నష్టం: ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటే రూ. 10,000 సాయం.
చిరు వ్యాపారులకు: దుకాణాలు దెబ్బతిన్న వ్యాపారులకు రూ. 20,000, తోపుడు బండ్లు (పుష్ కార్ట్స్) పాడైపోయిన వారికి రూ. 20,000 సాయం.
చిన్న పరిశ్రమలకు: ఎంఎస్ఎంఈ/చిన్న పరిశ్రమలకు రూ. 50,000; రూ. 1.50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు రూ. 1,00,000 వరకు పరిహారం.
వాహనాలకు నష్టం: వరదల్లో దెబ్బతిన్న బైక్‌లకు రూ. 3,000, ఆటోలు/త్రీవీలర్లకు రూ. 10,000 చొప్పున ఆర్థిక తోడ్పాటు.
మత్స్యకారులు, పశుపోషకులకు భారీ పరిహారం
తీర ప్రాంతాల్లో తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, పెంపకందారులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది:బోట్లు & వలలు: ఫిషింగ్ బోట్ల మరమ్మతులకు రూ. 9,000, వలల రిపేర్లకు రూ. 5,000, నెట్ పూర్తిగా డ్యామేజ్ అయితే రూ. 20,000, బోటుతో పాటు వల పూర్తిగా ధ్వంసమైతే రూ. 25,000 పరిహారం.
పశు సంపద నష్టం: వరదల్లో పశువులు మరణిస్తే ఒక్కోదానికి రూ. 50,000, గొర్రెలు/మేకలు చనిపోతే రూ. 7,000 చొప్పున పరిహారం.
కోళ్లు & షెడ్లు: మృతి చెందిన ప్రతి కోడికి రూ. 100, పశువుల లేదా పౌల్ట్రీ షెడ్లు దెబ్బతింటే రూ. 5,000 సాయం.
తుపాను బాధితులకు ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా పరిహారం చేరేలా పారదర్శక విధానాన్ని అమలు చేయాలని, ఏ ఒక్క అర్హుడూ నష్టపోకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.
