DK Shivakumar

DK Shivakumar: 4 స్థానాల్లోనూ ఎన్డీయే క్లీన్ స్వీప్.. డీకే శివకుమార్‌పై బీజేపీ సెటైర్లు!

DK Shivakumar: కర్ణాటక శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా కింద ఎన్నికలు జరిగిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలనూ విపక్ష నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీఎస్ (JD-S) కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న ఒక్క స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మిగిలిన స్థానాల్లో పట్టు సాధించాలనుకున్న అధికార కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

డీకే బ్రో.. అయిపోయింది!.. సోషల్ మీడియాలో బీజేపీ ట్రోల్స్..!

నాలుగు స్థానాల్లోనూ ఎన్డీయే భారీ విజయం సాధించడంతో బీజేపీ కర్ణాటక విభాగం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కౌంటర్లు వేసింది.
“డీకే.. ఇట్స్ డన్ బ్రో! ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో 4/4 స్థానాలను ఎన్డీయే స్వీప్ చేసింది!”
అంటూ శివకుమార్ తలపై బంతిపూల దండ పెట్టుకున్న పాత ఫోటోను జత చేస్తూ పోస్ట్ పెట్టింది. 2023 ఫిబ్రవరిలో అప్పటి బీజేపీ సీఎం బసవరాజ్ బొమ్మై బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో డీకే శివకుమార్ విధానసభలో వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ దిగిన ఆ ఫొటోను రీపర్పస్ చేస్తూ బీజేపీ ఎద్దేవా చేసింది.
4 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటమి: ఫలితాల వివరాలు..
  • బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గం: అధికార కాంగ్రెస్‌కు ఇక్కడ ఊహించని పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పుట్టణ్ణపై ఎన్డీయే మద్దతుతో బరిలోకి దిగిన జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ 908 ఓట్ల తేడాతో గెలుపొంది ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
  • నార్త్-ఈస్ట్ ఉపాధ్యాయ నియోజకవర్గం: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత గడ్డ అయిన కలబురగి పరిధిలోని ఈ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ శశిల్ జి. నామోషి ఐదోసారి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శరణప్ప మట్టూర్‌ను ఆయన ఓడించారు.
  • మిగిలిన స్థానాలు: సౌత్-ఈస్ట్ గ్రాడ్యుయేట్స్, వెస్ట్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ తన పట్టును నిరూపించుకుంటూ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది.

ఇప్పుడు పేపర్ చోరీ అంటారా?.. నిఖిల్ కుమారస్వామి కౌంటర్

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
“ఇక్కడ నిందించడానికి ఈవీఎంలు లేవు.. రాష్ట్ర యంత్రాంగం మొత్తం మీ చేతుల్లోనే ఉంది.. ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో జరిగాయి. ఇప్పుడు మీ ఓటమికి ‘పేపర్ చోరీ’ (బ్యాలెట్ పేపర్ల దొంగతనం) అని వంకలు చెబుతారా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ–జేడీఎస్ కూటమి మధ్య సమన్వయం, ఓటు బదిలీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఫలితాలు నిరూపించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో విద్యావంతులు, ఉపాధ్యాయులు ఓట్లు వేసిన ఈ నాలుగు స్థానాల్లోనూ ఓటమి చవిచూడటం అధికార కాంగ్రెస్‌కు పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *