బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచడం, నీటి లభ్యత, ముంపు ప్రభావం, రైతులకు పరిహారం చెల్లింపుపై సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో ఉమ్మడి అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పూర్వ హైదరాబాద్ సంస్థానం నాటి నుంచే తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు బలమైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు, ఆదివాసీలు దశాబ్దాలుగా తాగు, సాగునీటి సౌకర్యాలు లేక తీవ్ర ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“జల్, జంగిల్, జమీన్” (నీరు, అడవి, భూమి) కోసం అమరుడైన గిరిజన యోధుడు కొమురం భీమ్ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. సరిహద్దుల్లోని వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను పెంచేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆదిలాబాద్లో ప్రతిపాదిత పౌర, రక్షణ విమానాశ్రయం పూర్తయితే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణా, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఇరువైపుల ప్రజలకు మేలు చేసే బహుముఖ ప్రాజెక్టుగా నిలుస్తుందని వివరించారు.
152 మీటర్ల ఎత్తుతోనే సంపూర్ణ ప్రయోజనం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు సాంకేతిక ఆవశ్యకతను మహారాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. 2016 నాటి ఒప్పందం ప్రకారం నిర్ణయించిన 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని స్పష్టం చేశారు. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచడం ద్వారా గ్రావిటీ (సహజ ప్రవాహం) ఆధారంగా నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుందన్నారు.
దీనివల్ల నిరంతర విద్యుత్ అవసరాలు, అధిక పంపింగ్ వ్యయం భారీగా తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రాజెక్టు దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. ఒకవేళ ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ముంపునకు గురైతే.. అక్కడి ప్రభుత్వ నిబంధనలు, భూసేకరణ చట్టాల ప్రకారమే బాధిత రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర.. ఉమ్మడి అధ్యయనానికి నిర్ణయం
తెలంగాణ ప్రతిపాదనలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పునఃపరిశీలించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే మహారాష్ట్ర ప్రజలకు, వ్యవసాయ భూములకు ప్రతికూల ప్రభావం కలగకుండా సాంకేతిక, పర్యావరణ, ముంపు ప్రభావ అంచనాలను క్షేత్రస్థాయిలో లెక్కించాలని స్పష్టం చేశారు. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో సమగ్ర నివేదికను రూపొందించాలని నిర్ణయించారు.
ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగిన చర్చల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు పరిశీలనకు మార్గం సుగమమైంది. ముంపునకు పరిహారం చెల్లింపు, గ్రావిటీ ఆధారిత నీటి సరఫరా అంశాలపై సాంకేతిక అధ్యయనం జరిపి తుది నిర్ణయం తీసుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి.