Dhanush: ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ తన అభిమాన సంక్షేమ సంఘం మహిళా విభాగం ప్రతినిధులతో చెన్నైలో నిర్వహించిన సమావేశం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నై సెమ్మంచేరిలోని జెప్పియార్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ భారీ సమ్మేళనంలో పాల్గొన్న సుమారు 5,000 మంది మహిళా ప్రతినిధులకు ధనుష్ ప్రత్యేకంగా వెండి కామాక్షి దీపాలను కానుకగా అందజేశారు. అయితే, ఆ వెండి దీపాల వెనుక భాగంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల చిహ్నమైన ‘కమలం’ (తామర) గుర్తు ముద్రించి ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
5 వేల మంది మహిళలతో భారీ సమ్మేళనం
నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ పెట్టిన నేపథ్యంలో, కోలీవుడ్‌లో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై గత కొద్ది రోజులుగా జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. తన అభిమాన సంఘాలను సంక్షేమ వేదికలుగా మార్చిన ధనుష్, ప్రత్యేక జెండాను రూపొందించే పనిలో కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తమిళనాడు నలుమూలల నుంచి దాదాపు 5,000 మంది మహిళా ప్రతినిధులు తరలివచ్చిన ఈ సమావేశంలో ధనుష్ తెల్లటి దుస్తుల్లో పాల్గొని వారందరినీ ఉత్సాహపరిచారు. “మహిళల గళం పెరిగితేనే సమాజం ఎదుగుతుంది.. మా అన్నయ్య ధనుష్ మా నాయకుడు” అంటూ మహిళా శ్రేణులు భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
వెండి దీపం వెనుక ‘కమలం’ గుర్తు.. అసలు కథేంటి?
సమావేశం ముగిసిన అనంతరం ప్రతినిధులకు ప్రముఖ జీఆర్టీ జ్యువెలర్స్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి కామాక్షి దీపాలను ధనుష్ బహూకరించారు. అయితే ఆ దీపాల వెనుక భాగంలో చిన్న సైజులో తామర పువ్వు గుర్తు ఉండటాన్ని అభిమానులు గుర్తించి నెట్టింట షేర్ చేశారు. ఇటీవల ధనుష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనే ఆయన రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారని, అక్కడ బీజేపీ అగ్ర నేతలతో రహస్య చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కానుకగా ఇచ్చిన దీపాలపై కమలం గుర్తు కనిపించడంతో ఇది సాధారణ విషయం కాదని, రాజకీయ సంకేతమేనని కొందరు విశ్లేషిస్తున్నారు.
కేంద్ర మంత్రి పదవిపై ప్రచారం
రజనీకాంత్ ఆశీస్సులతో ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే పూర్తి మద్దతు ఇస్తామని లేదా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ద్వారా ముందుకు వెళ్తే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. జాతీయ అవార్డులు సాధించి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ధనుష్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఆ చర్చలకు కృతజ్ఞతగా, అభిమానులకు బీజేపీతో సాన్నిహిత్యాన్ని సూచించేందుకే ఆయన ఉద్దేశపూర్వకంగా తామర గుర్తు ఉన్న దీపాలను పంపిణీ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళా అభిమానుల సమావేశంలో నటుడు ధనుష్ అందించిన వెండి కామాక్షి దీపాలపై బీజేపీ గుర్తు ఉండటం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి వేగంగా పావులు కదుపుతున్నారా, లేక బీజేపీ మద్దతుతో ముందడుగు వేస్తారా అన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
