AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అధికార ఎన్డీయే (టీడీపీ-జనసేన-బీజేపీ) కూటమి భారీ ముందంజ వేసింది. పోలింగ్ జరగడానికి ముందే రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ 17 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 15 దక్కించుకోగా.. జనసేన 1, బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి.
వార్డులు, డివిజన్లలో క్లీన్ స్వీప్ దిశగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా.. వార్డులు, డివిజన్ల స్థాయిలోనూ కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి పక్షాల తరఫున ఏకంగా 726 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో టీడీపీకి 660, జనసేనకు 38, బీజేపీకి 28 స్థానాలు దక్కాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే ఏకగ్రీవాలను నమోదు చేయగలిగింది. స్వతంత్రులు 5 స్థానాల్లో, సీపీఐ ఒక వార్డులో విజయం సాధించాయి. శాతాల పరంగా చూస్తే మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం స్థానాలు పోలింగ్‌కు ముందే ఖరారయ్యాయి.
