Credit Card

Credit Card: క్రెడిట్ కార్డు ‘మినిమం డ్యూ’ కడుతున్నారా? అయితే భారీ అప్పుల ఊబిలో పడ్డట్టే.. అసలు మోసం ఇదే!

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్న వారిలో చాలామంది ప్రతి నెలా స్టేట్‌మెంట్ రాగానే అంతా బానే ఉందని భావిస్తూ కేవలం ‘మినిమం అమౌంట్ డ్యూ’ (కనీస చెల్లింపు) మాత్రమే కడుతుంటారు. అయితే ప్రతినెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నప్పటికీ అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (బకాయి మొత్తం) ఏమాత్రం తగ్గకపోవడానికి అసలు కారణం ఇదేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ కార్డులను సౌకర్యవంతమైన పేమెంట్ టూల్‌గా వాడుకోవాల్సింది పోయి, కేవలం కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ వెళ్తే అది తెలియకుండానే జీవితాన్ని అత్యంత ప్రమాదకరమైన రుణ ఊబిలోకి నెట్టేస్తుందని వివరిస్తున్నారు.
కట్టే మొత్తంలో ఎక్కువ భాగం వడ్డీలకే హాంఫట్!
క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమం డ్యూ చెల్లించినప్పుడు మీరు కట్టే డబ్బులో సింహభాగం కేవలం ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాంక్ వడ్డీలు, జీఎస్టీలకే సరిపోతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు బకాయి రూ. 1 లక్ష ఉందనుకుంటే.. నిబంధనల ప్రకారం ఏడాది పాటు కేవలం మినిమం డ్యూ మాత్రమే కట్టుకుంటూ వెళ్తే అతడు మొత్తం రూ. 69,160 వరకు చెల్లిస్తాడు. అయితే ఈ మొత్తంలో దాదాపు రూ. 47,630 కేవలం వడ్డీలు, ట్యాక్సులకే సరిపోతుంది. అసలు మొత్తం నుంచి తగ్గింది కేవలం రూ. 21,530 మాత్రమే. అంటే దాదాపు రూ. 70 వేల వరకు చెల్లించినా, ఏడాది తర్వాత కూడా ఇంకా రూ. 78,470 పైనే అప్పు మిగిలి ఉంటుంది.
వడ్డీ లేని గడువు రద్దు.. అప్పు మరింత భారం
మినిమం డ్యూ మాత్రమే కట్టడం వల్ల మరో తీవ్రమైన నష్టం జరుగుతుంది. సాధారణంగా క్రెడిట్ కార్డులపై లభించే 45 నుంచి 50 రోజుల వడ్డీ లేని కాలపరిమితి (గ్రేస్ పీరియడ్) పూర్తిగా రద్దవుతుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పాక్షికంగా బిల్లు చెల్లించినప్పుడు పాత బకాయిపైనే కాకుండా, కొత్తగా కార్డుతో కొనుగోలు చేసిన తేదీ నుంచే నెలకు 3.5% నుంచి 4% వరకు (వార్షికంగా 40% నుంచి 48% పైగా) అధిక వడ్డీలు పడటం మొదలవుతాయి. దీనివల్ల చక్రవడ్డీ రూపంలో బకాయి మరింత వేగంగా పెరిగిపోతుంది.
బయటపడే మార్గాలివే
అత్యవసర పరిస్థితుల్లో ఒకట్రెండు నెలలు మినిమం డ్యూ చెల్లించడం సహజమే అయినప్పటికీ, ప్రతినెలా దాన్నే అలవాటుగా మార్చుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు..
  • కార్డ్ బకాయిలపై పడే అధిక వడ్డీని తప్పించుకోవడానికి తక్కువ వడ్డీ లభించే పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ ద్వారా ఆ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయడం మంచి ప్రత్యామ్నాయం.
  • అవసరమైతే బకాయి మొత్తాన్ని తక్కువ వడ్డీతో ఈఎంఐ (EMI)గా మార్చుకోవాలి.
  • నెలవారీ బడ్జెట్‌కు మించి క్రెడిట్ కార్డులను స్వైప్ చేయకుండా ఖర్చులను నియంత్రించుకోవాలి.
క్రెడిట్ కార్డు ‘మినిమం అమౌంట్ డ్యూ’ అనేది బ్యాంకులు అందించే తాత్కాలిక వెసులుబాటు మాత్రమే తప్ప, అప్పు తీర్చే మార్గం కాదు. ప్రతి నెలా బిల్లును గడువులోగా పూర్తిగా చెల్లించడం ఒక్కటే భారీ వడ్డీలు, అప్పుల ఊబి నుంచి మిమ్మల్ని కాపాడే సురక్షితమైన ఆర్థిక అలవాటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *