Aircraft Crash

Aircraft Crash: గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!

Aircraft Crash: ఫిలిప్పీన్స్ వైమానిక దళం (PAF)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సైనిక శిక్షణలో భాగంగా గాల్లో విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానాలు ఒకదానికొకటి బలంగా ఢీకొని కుప్పకూలాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానాల్లో ఉన్న నలుగురు సైనిక పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మనీలాకు దక్షిణాన ఉన్న లిపా నగరంలోని ‘ఫెర్నాండో ఎయిర్ బేస్’ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 3:51 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

శిక్షణ కోసం వినియోగించే రెండు ‘ఎస్‌ఎఫ్-260’ (SF-260) సింగిల్ ప్రొపెల్లర్ తేలికపాటి విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. రెండు విమానాలు ఎయిర్ బేస్ సరిహద్దు పరిధిలోనే కూలిపోయాయని, భూమిపై ఇతరులెవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదని వైమానిక దళ ప్రతినిధి కల్నల్ అల్విన్ కాపింగుయాన్ వెల్లడించారు. నలుగురు పైలట్ల మృతిని ధ్రువీకరించిన వైమానిక దళం.. వారి సేవలను కొనియాడుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక పైలట్ల సమన్వయ లోపమా అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా తమ వద్ద ఉన్న ఎస్‌ఎఫ్-260 రకానికి చెందిన అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (గ్రౌండింగ్) ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా ఫిలిప్పీన్స్ సైనిక విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ ఇదే రకానికి చెందిన మరో విమానం కూలిపోయి ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన తాజా ప్రమాదంతో మళ్లీ చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *