Alluri District

Alluri District: మైనింగ్ చేస్తుండగా పేలుడు.. టీచర్‌ సహా ఆరుగురు దుర్మరణం!

Explosion In Mining: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పరిధిలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి నిర్మాణం, మైనింగ్ పనుల నిమిత్తం కొండను తొలిచేందుకు తెచ్చిన జిలెటిన్ స్టిక్స్ తీవ్రస్థాయిలో పేలిపోవడంతో అక్కడికక్కడే ఆరుగురు  ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో విధులకు వెళ్తున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పాటు టిప్పర్ డ్రైవర్, మరో నలుగురు కార్మికులు దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

రహదారి పనుల్లో విస్ఫోటనం – వాహనాలు ధ్వంసం
అందిన సమాచారం ప్రకారం.. పినకోట ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల కోసం కొండను పేల్చేందుకు కార్మికులు జిలెటిన్ స్టిక్స్ అమర్చారు. మరోవైపు వాహనంలో డీజిల్ నింపుతున్న సమయంలో అనుకోకుండా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు సమీపంలో ఉన్న టిప్పర్‌తో పాటు మరో వాహనం పూర్తిగా తునాతునకలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో పాఠశాలకు వెళ్లేందుకు అటుగా ప్రయాణిస్తున్న విశాఖపట్నానికి చెందిన ఉపాధ్యాయురాలు సునీత ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
మృతుల వివరాలు
ఈ పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఉపాధ్యాయురాలు సునీతతో పాటు దేవరాపల్లికి చెందిన కార్మికుడు మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్, మరో టిప్పర్ డ్రైవర్ ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
స్పందించిన హోంమంత్రి అనిత
పినకోట పేలుడు దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఆమె ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన హోంమంత్రి, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో జరిగిన భారీ పేలుడులో టీచర్ సహా ఐదుగురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయగా, క్షతగాత్రులకు నాణ్యమైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *