Revanth Reddy: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ‘బోధి పెవిలియన్’లో ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై అధికారులతో విస్తృతంగా సమాలోచనలు జరిపారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. త్వరలోనే చర్చలకు ఆహ్వానిస్తామని మహారాష్ట్ర సీఎం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో, సమగ్ర సమాచారంతో సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనీసం 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మిస్తే లభ్యమయ్యే నీరు, మహారాష్ట్ర పరిధిలో ముంపునకు గురయ్యే భూముల వివరాలపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేలా పక్కా నివేదికలతో కార్యాచరణ రూపొందించాలని, గతంలో ఢిల్లీలో జరిగిన సమావేశాల డేటాను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం సూచించారు.
మరోవైపు డిండి, అచ్చంపేట ప్రాజెక్టుల నీటి కేటాయింపులపై కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని పేర్కొన్నారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదులకు అదనంగా 0.6 టీఎంసీల నీటిని తరలించేలా చర్యలు చేపట్టాలని, పాలమూరు ప్రాజెక్టు అవసరాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని అధికారులను ఆదేశించారు. పంప్‌హౌస్‌లు, పంపుల అమరిక తదితర పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
