AP SEC: 

AP SEC: అభ్యర్థులకు పోలీస్ రక్షణ.. ఫోన్ చేసి మరీ నామినేషన్లు వేయించండి!

AP SEC: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు ఎదురవుతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించింది. నామినేషన్లు వేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఏ అభ్యర్థి అయినా ఫిర్యాదు చేస్తే, సంబంధిత అధికారులు ఆ అభ్యర్థికి ఫోన్ ద్వారా సంప్రదించి, నిర్దేశిత గడువు ముగిసేలోగా వారు నామినేషన్ దాఖలు చేసేలా పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల గడువు ముగియనుండగా, నామినేషన్ల గడువును పొడిగించే ప్రసక్తే లేదని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. అయితే గడువు ముగిసేలోపు ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు అవసరమైన చోట పోలీసులు వ్యక్తిగత భద్రత కల్పించాలని, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించి అభ్యర్థులను పోలీసు రక్షణతో నామినేషన్ కేంద్రాలకు చేర్చి ప్రశాంతంగా నామినేషన్లు వేయించాలని ఆదేశాల్లో పేర్కొంది. రిటర్నింగ్ అధికారులు (ROs) కూడా నిబంధనల ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా నామినేషన్లను స్వీకరించాలని, ఈ నిబంధనలను తక్షణమే పక్కాగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఎస్‌ఈసీ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *