Abhijeet Dipke: దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ‘లెహ్రా దో తిరంగా’ (Lehra Do Tiranga) నిరసన మార్చ్ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ పార్క్ వద్ద నిరసనకు బయలుదేరుతుండగా అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
మరోవైపు శుక్రవారం సాయంత్రం ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాను శనివారం తెల్లవారుజామున పోలీసులు విడుదల చేశారు. విడుదల అనంతరం ఆమె కేంద్ర ప్రభుత్వంపై, ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అభిజీత్ దీప్కేకు బెయిల్ మంజూరు..
శుక్రవారం సాయంత్రం జండేవాలన్ వద్ద తన నివాసం నుంచి కన్నాట్ ప్లేస్ వైపు వెళ్తుండగా పోలీసులు దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
-
కేసు నమోదు & ఎస్ఈఎం కోర్టు..శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్లు 126, 170 కింద ఢిల్లీ పోలీసులు ఆయనపై తాజా కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు ముందు హాజరుపరిచారు.
-
పీస్ బాండ్‌పై విడుదల..న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిర్దేశిత శాంతి భద్రతల బాండ్ (Peace Bond) సమర్పించిన అనంతరం ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లకుండా బయటకు రానున్నారు.
-
గతంలోనూ బాండ్..అంతకుముందు అక్టోబర్ 10న ఢిల్లీ విమానాశ్రయంలో ఫ్లైట్ లోపల నుంచి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఏడాది పాటు ఎలాంటి అలజడులు సృష్టించబోనని ఆయన పీస్ బాండ్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే.
-
ఇంకా కస్టడీలోనే కీలక నేతలు..జంతర్ మంతర్ పరిసరాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కేసులో ఇప్పటికే అరెస్టయిన సీజేపీ కీలక కార్యకర్తలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
ఇది ముమ్మాటికీ అక్రమ నిర్బంధమే.. నేహా బోరా ఫైరింగ్
శుక్రవారం మండి హౌస్ వద్ద అదుపులోకి తీసుకున్న ఐసా అధ్యక్షురాలు నేహా బోరాను.. ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 65 కింద లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ఆర్కే పురం పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు.విడుదల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.
-
రాత్రంతా పోలీస్ స్టేషన్లలోనే:“నన్ను మండి హౌస్ వద్ద అదుపులోకి తీసుకుని దాదాపు ఐదు గంటల పాటు నగరమంతా తిప్పుతూ వేధించారు. అర్ధరాత్రి మా లాయర్లు వచ్చినా కలవనివ్వలేదు. అనారోగ్యంతో ఉన్నా మందులు ఇవ్వడానికి నిరాకరించారు. ఏ చట్టం ప్రకారం రాత్రంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధిస్తున్నారో పోలీసులు చెప్పాలి” అని నిలదీశారు.
-
సిటీలో కర్ఫ్యూ వాతావరణం:సెంట్రల్ ఢిల్లీని కర్ఫ్యూ జోన్లా మార్చారని, శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులను, పౌరులను అక్రమంగా డిటైన్ చేయడం పోలీసులకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
సీఈసీ రాజీనామా చేయాల్సిందే:“ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయి. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తమ అహంకారాన్ని వీడాలి. వెంటనే ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి, లేదా ఆయనను అభిశంసించి (Impeach) జైలుకు పంపాలి” అని డిమాండ్ చేశారు.
కన్నాట్ ప్లేస్ దిగ్బంధం – 150 మంది నిరసనకారుల డిటెన్షన్..
-
భారీ బందోబస్తు:శుక్రవారం నాటి నిరసన పిలుపు నేపథ్యంలో కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌ను రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), పారామిలిటరీ బలగాలు చుట్టుముట్టాయి. పార్క్ లోపలికి ఎవరినీ అనుమతించకుండా బారికేడ్లతో కట్టుదిట్టం చేశారు.
-
పోలీసుల వాదన:శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే కన్నాట్ ప్లేస్ వైపు వెళ్తున్న సుమారు 150 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
అరెస్టులు, పోలీస్ నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని, సీఈసీ రాజీనామా చేసేవరకు మరియు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు, సీజేపీ శ్రేణులు స్పష్టం చేశాయి.
