Pulivendula: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్ కేంద్రం సమీపంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో శాంతిభద్రతలను కాపాడేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో కొందరు వైకాపా కార్యకర్తలు పోలీసులపైకి దూసుకురావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను నిలువరించి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దాలతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం నామినేషన్ కేంద్రం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
