Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకేసారి ర్యాలీలుగా రావడంతో మొదలైన వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రయాణిస్తున్న కారు అతివేగంగా టీడీపీ శ్రేణులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను కారు బలంగా ఢీకొట్టడంతో పాటు వారి మీద నుంచి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తలను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు ఇరువర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో పరిసర ప్రాంతాలన్నీ రణరంగంగా మారాయి. రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమవడంతో పాటు మధు అనే టీడీపీ కార్యకర్త తలకు బలమైన గాయమైంది. తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించారని టీడీపీ వర్గాలు ఆరోపించగా, ఇరువైపులా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేశారు. నామినేషన్ల తొలిరోజే వాహనం దూసుకెళ్లడం, రాళ్లదాడి వంటి తీవ్ర ఘటనలు చోటుచేసుకోవడంతో పుంగనూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
