Ranabaali Review:
-
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ ఫేమ్), ఈశ్వరి రావు, వినోద్ సాగర్, మధు, ల్యూక్ మెక్‌గిబ్నీ, వ్లాదిమిర్ ఏంజెలోవ్, జాకరీ కాఫిన్, బెనెడిక్ట్ గారెట్, ఎడ్వర్డ్ జే మార్ష్ తదితరులు
-
దర్శకత్వం: రాహుల్ సంకృత్యన్
-
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
-
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
-
సంగీతం: అజయ్-అతుల్
-
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ, నీరవ్ షా
-
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
బాక్సాఫీస్ వద్ద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సాలిడ్ బ్లాక్‌బస్టర్ కొట్టి చాలా కాలమే అయింది. రీసెంట్ సినిమా ‘కింగ్డమ్’ భారీ హైప్ తెచ్చుకున్నప్పటికీ ఆడియన్స్‌ను పూర్తిగా మెప్పించలేక యావరేజ్‌గానే నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా క్లీన్ హిట్ కొట్టాలనే కసితో, గతంలో తనకు ‘టాక్సీవాలా’ వంటి డీసెంట్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబోలో 19వ శతాబ్దపు బ్రిటీష్ కాలం నాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమే ‘రణబలి’ (Ranabaali).
ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ నుంచే భారీ బజ్ నెలకొంది. విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడం, పైగా వీరిద్దరి వివాహం తర్వాత స్క్రీన్‌పై జంటగా కనిపిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పీక్స్‌కు చేరాయి. దీనికితోడు హాలీవుడ్ క్లాసిక్ ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ పవర్ఫుల్ విలన్‌గా నటించడం, బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్స్ అజయ్-అతుల్ స్వరాలు సమకూర్చడం వంటి అంశాలు సినిమాను హాట్ టాపిక్‌గా మార్చాయి. మరి భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘రణబలి’ ఆ అంచనాలను అందుకుందా? రాహుల్ సంకృత్యన్ హ్యాట్రిక్ కొట్టాడా? విజయ్ ఖాతాలో హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం!
కథేంటంటే? (Storyline)..
కథలోకి వెళ్తే.. సింగనమల బొబ్బిలి రణబలి (విజయ్ దేవరకొండ) ఒక బలమైన సంకల్పంతో, శాపగ్రస్తమైన గడ్డపై జన్మిస్తాడు. కాలక్రమంలో ఆ నేలకే లెజెండ్‌గా మారతాడు. అసలు రణబలి జననం వెనుక ఉన్న ఆ రహస్య ఉద్దేశం ఏంటి? గ్రామ దేవత ‘భద్ర మల్లన్న’తో రణబలికి ఉన్న విడదీయరాని ఆధ్యాత్మిక బంధం ఎలాంటిది?
మరోవైపు బ్రిటీష్ పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ కమిషనర్‌గా పనిచేసే సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) గోల్ ఏంటి? 1876-1878 మధ్యకాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీని కుదిపేసిన మహా కరువు (Great Famine) వెనుక బ్రిటీష్ వాళ్ల దాహార్తి, భారత్ నుంచి ఇంగ్లండ్‌కు ధాన్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసిన సామ్రాజ్యవాద పాలసీల కుట్రలేంటి? భారత్‌లో బ్రిటీష్ వారు రైల్వే నెట్‌వర్క్‌ను అసలు ఎందుకు విస్తరించారు? తన ప్రజలను, మాతృభూమిని ఆకలి చావుల నుంచి కాపాడటానికి తెల్లదొరల అరాచకాలపై రణబలి ఎలా తిరగబడ్డాడు? అన్నదే మిగతా కథ.
ఎలా ఉంది? (Movie Analysis)..
బ్రిటీష్ వారి క్రూర పాలన నేపథ్యంలో కథలు చెప్పడం భారతీయ సినిమాలో కొత్తేమీ కాదు. కొన్నేళ్లుగా ఈ జోనర్ పూర్తి శాచ్యురేషన్ లెవెల్‌కు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ‘RRR’లో చారిత్రక పాత్రలకు భారీగా ఫిక్షన్ యాడ్ చేసి కమర్షియల్ విజువల్ వండర్‌గా మార్చాల్సి వచ్చింది. అయితే డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ “మనం మరిచిపోయిన గతం.. మన నుంచి దోచుకోబడిన భవిష్యత్తు” అనే పాయింట్‌ను నమ్మి, 1876 నాటి మద్రాస్ కరువు, ధాన్యపు దోపిడీ అనే రేర్ హిస్టరీని ఎంచుకోవడం అభినందనీయం.
సినిమా ప్రారంభం కాస్త తడబాటుతో మొదలవుతుంది. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ఓపెనింగ్ సీన్లు, మొదటి 15 నిమిషాల్లో విజయ్ డైలాగ్ డెలివరీ పెద్దగా సింక్ అవ్వక ఆడియన్స్‌ను కాస్త డిస్టర్బ్ చేస్తాయి. అయితే ఆర్నాల్డ్ వోస్లూ ఎంట్రీతో కథ పక్కా ట్రాక్‌లోకి ఎక్కుతుంది.
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల కెమిస్ట్రీ. రియల్ లైఫ్ కపుల్ కావడంతో స్క్రీన్‌పై వారిద్దరి బాండింగ్, రొమాంటిక్ సీన్లు, ఐ-కాంటాక్ట్ మూమెంట్స్ చాలా నేచురల్‌గా వర్కౌట్ అయ్యాయి. వీరి లవ్ ట్రాక్‌తో పాటు బ్రిటీష్ అధికారులు గ్రామానికి వచ్చినప్పటి సీక్వెన్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే మైండ్-బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్‌ను హై లెవెల్లో నిలబెడతాయి.
అయితే, సెకండ్ హాఫ్ ఆరంభంలో వచ్చే కేవ్ ఫైట్ (గుహ పోరాట సన్నివేశం) తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. అక్కడి నుంచి కథనం చాలా ప్రిడిక్టబుల్ జోన్లోకి జారుకుంటుంది. కథ ఎక్కడికక్కడ ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ ల్యాగ్ అవుతున్న భావన వస్తుంది. సినిమా ముగింపుకు వచ్చిందనుకునే టైమ్‌లో ‘కొబలి’ అనే సరికొత్త చాప్టర్‌ను దర్శకుడు యాడ్ చేశాడు. కానీ అక్కడ వచ్చే ట్విస్ట్ పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో ఆడియన్స్ దాన్ని ముందే ఈజీగా గెస్ చేసేస్తారు. క్లైమాక్స్ ఎమోషన్లు, కీలక పాత్ర మరణం వంటి సన్నివేశాలు కూడా నాచురల్‌గా కనెక్ట్ కావు. చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఛాయలు గుర్తుకొస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్..
-
విజయ్ దేవరకొండ: కడప యాసను పలకడంలో చాలా వరకు న్యాయం చేశాడు. రణబలి లుక్‌లో ఫిట్‌గా కనిపించాడు. రష్మికతో వచ్చే సీన్లలో తనదైన మార్క్ వేసినా.. యాక్షన్ బ్లాక్స్‌లో అతని బాడీ లాంగ్వేజ్ కాస్త స్టిఫ్‌గా, కాన్షియస్గా నటించినట్టు అనిపిస్తుంది.
-
రష్మిక మందన్న: జయమ్మగా రష్మిక వన్‌మ్యాన్ షో చేసింది. డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్లలో ఆమె యాక్టింగ్ సూపర్బ్. సినిమాకు ఆమె నటన మెయిన్ పిల్లర్.
-
ఆర్నాల్డ్ వోస్లూ: హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ తన భారీ కటౌట్, గంభీరమైన కళ్లతో సర్ థియోడర్గా సెటిల్డ్ అండ్ టెర్రిఫిక్ విలనిజం పండించారు.
-
ఇతర నటులు: రణబలి తల్లిగా ఈశ్వరి రావు హుందాగా నటించగా, వినోద్ సాగర్ మరోసారి తన మార్క్ రోల్లో మెప్పించారు. బ్రిటీష్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగం ఆశించే పాత్రలో నటించిన యాక్టర్ ప్రీ-క్లైమాక్స్‌లో మంచి ఇంపాక్ట్ ఇచ్చారు.
టెక్నికల్ టీమ్ పనితీరు..
-
సంగీతం: అజయ్-అతుల్ మ్యూజిక్ సినిమాకు రిఫ్రెషింగ్ వైబ్‌ను ఇచ్చింది. ‘ఎందయ్యా సామి’ మెలోడీ సాంగ్ ఆడియో పరంగా, విజువల్ పరంగా బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పీరియడ్ మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేసింది.
-
సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్: జిష్ణు భట్టాచార్జీ, నీరవ్ షా కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా గుహ ఫైట్ సీక్వెన్స్‌లో లైటింగ్, విజువల్స్ అదిరిపోయాయి. అయితే ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ సెకండ్ హాఫ్‌పై మరింత కత్తెర వేయాల్సింది. కనీసం 10-15 నిమిషాల సీన్లు ట్రిమ్ చేసి ఉంటే ఫ్లో బాగుండేది.
-
వీఎఫ్ఎక్స్ & నిర్మాణం: మద్రాస్ పోర్ట్ సీన్లో వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చాలా పేలవంగా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బడ్జెట్ పరిమితులకు లోబడి డీసెంట్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్..
-
ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ & ప్రీ-ఇంటర్వెల్ బ్యాంగ్
-
విజయ్ – రష్మికల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ
-
కొత్త హిస్టారికల్ పాయింట్‌ను ఎంచుకున్న సిన్సియారిటీ
-
సెకండ్ హాఫ్‌లో వచ్చే గుహ ఫైట్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్..
-
రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ సెకండ్ హాఫ్
-
సాగదీసినట్టు ఉండే లెంగ్తీ రన్‌టైమ్
-
సెకండ్ హాఫ్‌లో బలహీనమైన ఎమోషన్స్, పేలవమైన ట్విస్ట్‌లు
-
కొన్ని చోట్ల ప్యాచ్వర్క్లా అనిపించే వీఎఫ్ఎక్స్
సరికొత్త హిస్టారికల్ అంశాన్ని నిజాయతీగా తెరపైకి తీసుకురావాలన్న రాహుల్ సంకృత్యన్ ఆలోచన బాగున్నా, రొటీన్ స్క్రీన్‌ప్లే మరియు స్లో నెరేషన్ సినిమాకు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్‌లో కంటిన్యూ అయి ఉంటే రణబలి రేంజ్ మరోలా ఉండేది.
రేటింగ్: 2.0 / 5
పంచ్ లైన్: రణబలి – సిన్సియర్ అటెంప్ట్.. బట్ ఇంపాక్ట్ మిస్సయింది!
