Breaking News

Breaking News: కూలిన స్కూల్ పైకప్పు.. 32 మంది చిన్నారులతో పాటు టీచర్ మృతి..!

Breaking News: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో గురువారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని దిర్ కాలనీ ప్రాంతంలో ఉన్న ‘అల్ ఖైర్ పబ్లిక్ స్కూల్’ (Al Khair Public School) రెండంతస్తుల భవనం పైకప్పు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. తరగతి గదుల్లో పాఠాలు వింటున్న చిన్నారులపై భారీ కాంక్రీట్ స్లాబ్ పడటంతో ఏకంగా 32 మంది విద్యార్థులతో పాటు ఓ 25 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శిథిలాల కింద చిక్కుకుని సుమారు 50 మందికి పైగా చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రక్తమోడుతున్న పిల్లల ఆర్తనాదాలు, తమ వారి కోసం వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రుల గుండెలవిసే రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.
భారీ వర్షం.. నాసిరకం నిర్మాణమే కారణం..
పెషావర్‌లో బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా పాతబడిపోయిన పాఠశాల రెండంతస్తుల భవనం బాగా నానిపోయి బలహీనపడింది. గురువారం ఉదయం క్లాసులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో మరణించిన చిన్నారుల వయస్సు 6 నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానిక లేడీ రీడింగ్ హాస్పిటల్ (Lady Reading Hospital) వర్గాలు ధ్రువీకరించాయి.
ఇరుకైన వీధులు – సహాయక చర్యలకు ఆటంకం
పాఠశాల ఉన్న ప్రాంతం అత్యంత ఇరుకైన సందుల్లో ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఒకేసారి ఒక్క వాహనం మాత్రమే వెళ్లే సందు కావడంతో అంబులెన్స్‌లు, రెస్క్యూ వాహనాలు లోపలికి చేరుకోవడం కష్టతరమైంది. స్థానికులు, వాలంటీర్లే మొదటగా స్పందించి చేతులతోనే కాంక్రీట్ పెళ్లలను తొలగిస్తూ పిల్లలను బయటకు తీశారు.
ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ – పరిస్థితి విషమం..
క్షతగాత్రులను హుటాహుటిన పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఎక్కువ మంది పిల్లలకు తలలు, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
భారీ సంఖ్యలో బాధితులు తరలిరావడంతో ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ) ప్రకటించి వైద్య సేవలు అందిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉంటారనే అనుమానంతో రెస్క్యూ టీమ్‌లు భారీ క్రేన్లు, పరికరాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

పాఠశాల యజమాని అరెస్ట్ – దర్యాప్తునకు ఆదేశం..

నిబంధనలకు విరుద్ధంగా భద్రతా ప్రమాణాలు పాటించకుండా, నాసిరకం మెటీరియల్‌తో స్కూల్ భవనాన్ని నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనకు బాధ్యుడిగా చేస్తూ పాఠశాల యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెషావర్ పోలీస్ అధికారులు ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ ఘటనను “గుండెల్ని పిండేసే విషాదం”గా అభివర్ణిస్తూ.. సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు.

పాక్‌లో వరుస భవన ప్రమాదాలు..

పాకిస్థాన్‌లో నిర్మాణ భద్రతా నిబంధనలను గాలికొదిలేయడం వల్ల తరచూ ఇలాంటి విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది వారాల క్రితమే ఇస్లామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సరీలో అగ్నిప్రమాదం జరిగి 14 మంది పసికందులు సజీవ దహనమయ్యారు.
గత జూలైలో లాహోర్‌లో నిర్మాణంలో ఉన్న కోచింగ్ సెంటర్ స్లాబ్ కూలి 14 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. తాజాగా పెషావర్‌లో జరిగిన ఈ పెను ప్రమాదం దేశంలో పాఠశాలల మౌలిక వసతుల భద్రతపై తీవ్ర విమర్శలకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *