Sridhar Babu: తెలంగాణ బొగ్గు గని కార్మికుల జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయంలో కార్మికులు గానీ, రాష్ట్ర ప్రజలు గానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
హైదరాబాద్‌లోని సీఎల్పీ (CLP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. సంస్థ ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ముమ్మాటికీ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేశారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
పదేళ్లు కేసీఆర్ ఫ్యామిలీ జేబు సంస్థలా మార్చుకున్నారు..
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారో శ్రీధర్‌బాబు లెక్కలతో సహా విమర్శించారు..
ఆర్థికంగా దెబ్బతీశారు..
కేసీఆర్ కుటుంబం పదేళ్లపాటు సింగరేణిని తమ సొంత ‘జేబు సంస్థ’లా మార్చుకుందని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వ విభాగాల నుంచి సింగరేణికి రావాల్సిన వేల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా సంస్థను ఆర్థికంగా చావుదెబ్బ కొట్టారని మండిపడ్డారు.
కార్మికులకు మాట్లాడే హక్కు లేదు..
బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అప్పట్లో సంస్థను అప్పులపాలు చేసిన నాయకులకు ఈరోజు కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హామీ – రక్షణ మాదే..
గతంలో సింగరేణిని కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నేడు ప్రజా పాలనలో కూడా కార్మికుల హక్కులను, సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ఆధారాలు లేకుండా బురదజల్లితే ఊరుకోం – మంత్రి వార్నింగ్..
సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కార్మికులకు మంత్రి పిలుపునిచ్చారు..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి స్థాయి ఆపరేషన్స్..
యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రభుత్వం పూర్తి స్థాయిలో నడిపిస్తుందని, దీని ద్వారా సింగరేణి బొగ్గు వినియోగం మరింత పెరుగుతుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
దుష్ప్రచారంపై కఠిన చర్యలు..
కనీస ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే చట్టపరంగా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
