Chicago

Chicago: 3000 మంది హిందువులని చంపాలనుకున్నాడు… అమెరికాలో 19 ఏళ్ల టీనేజర్ అరెస్ట్!

Chicago: అమెరికాలో ప్రవాస భారతీయులను, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని విద్వేష దాడులకు తెగబడుతున్న ఉదంతాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో సమీపంలో ఉన్న అరోరా (Aurora) పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయంపై సామూహిక కాల్పులు జరిపి పెద్ద సంఖ్యలో భారతీయులను ఊచకోత కోసేందుకు పన్నిన ఓ భయంకర కుట్రను స్థానిక పోలీసులు సమయస్ఫూర్తితో భగ్నం చేశారు.
ఒహియో రాష్ట్రంలోని శ్రీ స్వామినారాయణ ఆలయం ధ్వంసమైన కేవలం రెండు వారాల వ్యవధిలోనే, దసరా నవరాత్రి ఉత్సవాల రద్దీ సమయంలో ఈ భయానక కుట్ర వెలుగుచూడటం ప్రవాస భారతీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

ఆదివారం నవరాత్రి వేళ.. 3 వేల మంది భక్తుల సమక్షంలో టార్గెట్..

రద్దీ వేళ రక్తపాతానికి ప్లాన్..

అమెరికా దర్యాప్తు సంస్థలు, కోర్టు పత్రాల ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం.. అరోరాలోని బాలాజీ ఆలయానికి సాధారణంగానే ప్రతి ఆదివారం 3 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. పైగా ప్రస్తుతం దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఈ రద్దీని టార్గెట్ చేసుకుని అక్టోబర్ 11న రక్తపాతం సృష్టించాలని నిందితుడు పథకం రచించాడు.

19 ఏళ్ల టాకో బెల్ క్యాషియర్..
పాలటైన్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ (Alexandros Paporakis) స్థానిక ‘టాకో బెల్’ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అమాయక ముఖంతో కనిపించే ఈ యువకుడు.. అంతర్గతంగా తీవ్రమైన శ్వేతజాతీయ దురహంకార (White Supremacist), నియో-నాజీ భావజాలంతో విషాన్ని నింపుకున్నాడు.
కొలీగ్స్‌తో విద్వేష వ్యాఖ్యలు..
భారతీయులను చంపేందుకు ఇక వేచి ఉండలేకపోతున్నా.. వచ్చే ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు కాబోతోంది” అని పని చేసే చోట కొలీగ్స్‌తో తరచూ మాట్లాడేవాడు. అయితే అతడి వయసు చూసి తొలుత ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.
గన్ జామ్ కావడంతో తప్పిన పెను ప్రమాదం..
అక్టోబర్ 11న పపోరాకిస్ పూర్తి యుద్ధ సన్నద్ధతతో రంగంలోకి దిగాడు.. బాడీకి ఆర్మర్ ధరించి, మాడిఫైడ్ ఏఆర్-స్టైల్ (AR-style) అస్సాల్ట్ రైఫిల్‌తో తన తల్లి ఇంటి నుంచి 40 మైళ్లు డ్రైవ్ చేసుకుంటూ అరోరాలోని బాలాజీ ఆలయం వద్దకు చేరుకున్నాడు.
ఆలయం వద్దకు వచ్చి కాల్పులు జరిపేందుకు అతడు ట్రిగ్గర్ నొక్కాడు. కానీ విధి మరోలా ఉంది.. సాంకేతిక లోపంతో అతడి చేతిలోని రైఫిల్ అకస్మాత్తుగా జామ్ అయింది (బుల్లెట్ ఫైర్ కాలేదు). దీంతో ఏమీ చేయలేక తృటిలో అక్కడి నుంచి వెనుదిరిగాడు.
వెంటనే ఇంటికి పారిపోయిన పపోరాకిస్.. రైఫిల్ జామ్‌ను ఎలా క్లియర్ చేయాలో ఇంటర్నెట్‌లో వెతికాడు. ఆపై తనతో పనిచేసే సహోద్యోగికి ఫోన్ చేసి.. “గన్ జామ్ అయి పని చేయలేదు, ఎవరికీ దొరక్కుండా చేసొచ్చా.. మళ్లీ వెళ్తా” అంటూ మాట్లాడాడు. ఈ కాల్‌తో భయపడిన సదరు కొలీగ్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.
రంగంలోకి పోలీసులు – పపోరాకిస్ అరెస్ట్..
సమాచారం అందుకున్న వెంటనే పాలటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసు విభాగాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. పపోరాకిస్ మళ్లీ ఆలయం వైపు బయలుదేరేందుకు తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అతడిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.
ఇంట్లో బయటపడ్డ మారణాయుధాలు, నాజీ గుర్తులు..
అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు వెన్నులో వణుకుపుట్టే విషయాలు తెలిశాయి. 300 రౌండ్ల లైవ్ బుల్లెట్లు (10 మ్యాగజైన్లు), బాడీ ఆర్మర్, సౌత్ ఏషియన్లను దూషిస్తూ రాసిన గ్యాస్ డబ్బా, నాజీ స్వస్తిక చిహ్నాలు లభ్యమయ్యాయి.
‘అరోరా షూటర్’ మేనిఫెస్టో..
పోలీసులు ‘వై ఐ ఫౌట్: ఎ.కె.ఏ అరోరా షూటర్స్ మేనిఫెస్టో’ (Aurora Shooter’s Manifesto) పేరుతో అతడు రాసిన ద్వేషపూరిత లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో భారతీయులు, నల్లజాతీయులు, యూదులు వంటి శ్వేతేతరులందరినీ ఊచకోత కోయడమే తన నిత్య కల అని రాసుకున్నాడు.
కోర్టులో హాజరు – ఎఫ్‌బీఐ లోతైన దర్యాప్తు..
నిందితుడిని రోలింగ్ మెడోస్‌లోని కుక్ కౌంటీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి బెయిల్ నిరాకరిస్తూ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ కుట్ర వెనుక ఇతర ఉగ్ర నెట్‌వర్క్‌ల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఎఫ్‌బీఐ (FBI) తో కలిసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమయానికి స్పందించి భారీ ఊచకోతను తప్పించిన పోలీస్ బృందానికి హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) కృతజ్ఞతలు తెలిపింది. అమెరికాలోని హిందూ సమాజం, ఆలయ యాజమాన్యాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసుకోవాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *