Kadiri: కదిరి పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది.. తిరుమాడ వీధి రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిబంధనల ప్రకారం అర్హులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎవరినీ బలవంతం చేయబోమని, ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు. మరోవైపు, ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధితో పాటు, భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కదిరి పట్టణాన్ని మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, కూటమి నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
