Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో కీలక పరిణామం జరిగింది. ఆయన అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఇప్పటివరకు జరుగుతున్న సీబీఐ కేసుల విచారణతో పాటే, ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నమోదు చేసిన కేసులను కూడా ఇకనుంచి రోజువారీగా (డైలీ బేసిస్లో) విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రోజువారీ విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుల్లో జగన్తో పాటు మొత్తం 70 మంది నిందితులను కోర్టు వ్యక్తిగతంగా విచారించే అవకాశం ఉంది. వీరందరి కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన న్యాయస్థానం, వచ్చే సోమవారం నుంచే ఈడీ కేసుల రోజువారీ విచారణను మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకేసారి సీబీఐ, ఈడీ కేసులను రోజువారీగా విచారించాలని కోర్టు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
