Rahul Gandhi

Rahul Gandhi: నా టార్గెట్ 100 ఎఫ్‌ఐఆర్‌లు.. రోడ్డుపైన బైఠాయించిన రాహుల్.. !

Rahul Gandhi: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఓటర్ల జాబితాల సవరణ (SIR)లో భారీ అవకతవకలు జరిగాయని, ‘ఓటు చోరీ’కి బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు బయలుదేరిన ‘ఇండియా’ (INDIA) కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.

ముందస్తు అనుమతి లేదంటూ ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు పలువురు కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత పతాక స్థాయికి చేరింది.

లంచ్ భేటీ నుంచి జంతర్ మంతర్ వైపు – బస్సు పైకెక్కి ఎంపీల నినాదాలు..

బుధవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జన్పథ్‌లోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో ఇండియా కూటమి నేతల కీలక లంచ్ మీటింగ్ జరిగింది.. మా డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదు. ఈరోజు జంతర్ మంతర్ వద్ద భారీ బైఠాయింపు చేపడతాం  అని ఖర్గే ప్రకటించారు.

భోజనం ముగిసిన అనంతరం ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కూటమి ఎంపీలు ప్రత్యేక బస్సులో జంతర్ మంతర్ వైపు బయలుదేరారు. బస్సు పైకెక్కి ఎంపీలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ సింగ్ హుడా, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఇమ్రాన్ మసూద్ నిరసన నినాదాలు చేశారు.
మార్గమధ్యంలోనే ఢిల్లీ పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి బస్సును నిలిపివేశారు. దీంతో రాహుల్, ప్రియాంక బస్సు దిగి నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని చుట్టుముట్టి అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చివరకు రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
నా లక్ష్యం 100 ఎఫ్‌ఐఆర్‌లు.. ప్రతి కేసు నాకు మెడల్.. రాహుల్ గాంధీ కౌంటర్
ఆకాశవాణి భవన్ వద్ద దాదాపు 9 గంటల పాటు మంగళవారం నిర్వహించిన నిరసనకు సంబంధించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. దీనిపై జంతర్ మంతర్‌కు వెళ్లే ముందు రాహుల్ గాంధీ మీడియా వద్ద స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..
నా టార్గెట్ 100 ఎఫ్‌ఐఆర్‌లు.. 
నాపై ఇప్పటికే 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. నా లక్ష్యం 100 కేసులు చేయించుకోవడమే. నాపై 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం నాపై నమోదు చేసే ప్రతి ఎఫ్‌ఐఆర్ నాకు ప్రజల కోసం చేసిన పోరాటానికి ఇచ్చే గౌరవ పతకం (మెడల్) లాంటిది.
సీఈసీపై తీవ్ర ఆరోపణలు..
నిన్న లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన దాదాపు 300 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవాలని ప్రయత్నిస్తే ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. పోలీసులతో మమ్మల్ని అడ్డుకున్నారు. మా దృష్టిలో జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషనర్ కారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జ్ఞానేష్ కుమార్ కలిసి దేశ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశారు. ఇది ముమ్మాటికీ దేశద్రోహం. జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాల్సిందే” అని రాహుల్ తేల్చిచెప్పారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసమే తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తుంటే.. ప్రతిపక్ష ఎంపీల గొంతును పోలీసు బలంతో అణచివేయాలని చూడటం నియంతృత్వానికి పరాకాష్ట అని ఇండియా కూటమి ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *