Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర భవన ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ సీమాపురి (New Seemapuri) ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.
స్థానిక ఈద్గా మచ్ఛీ మండి సమీపంలో మధ్యాహ్నం సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక దళం (DFS), విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.
సహాయక చర్యలు ముమ్మరం – స్థానికుల ఆందోళన..
భవనం కూలిపోయిన వెంటనే స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. శిథిలాల కింద ఉన్నవారిని కాపాడేందుకు స్థానికులు సైతం పెను కాంక్రీట్ శ్లాబులను చేతులతో తొలగించే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శకటాలు, ప్రత్యేక రెస్క్యూ వాహనాలతో సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..
రెస్క్యూ వాహనాలు, అంబులెన్సులు వేగంగా ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రజలు సహకరించాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. సీమాపురి గోల్ చక్కర్, డీఎల్ఎఫ్ భోపురా మరియు పరిసర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఘటనా స్థలం వద్ద వాహనాలు నిలపవద్దని, అక్కడ గుమిగూడవద్దని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కోరారు.
నెల రోజుల వ్యవధిలోనే రెండో దుర్ఘటన – సత్య నికేతన్ ఘటన మరువకముందే..
సరిగ్గా నెల రోజుల క్రితం నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఐదంతస్తుల పీజీ భవనం కూలిపోయి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మరువకముందే.. సీమాపురిలో ఈ ప్రమాదం జరగడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
సత్య నికేతన్ కేసులో బయటపడ్డ నిర్లక్ష్యం..
సత్య నికేతన్ భవన ప్రమాదంపై ఢిల్లీ పోలీసులు జరిపిన విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రమాదానికి 10 రోజుల ముందు బేస్మెంట్లో ఎలాంటి ఇంజనీరింగ్ జాగ్రత్తలు లేకుండా మూడు లారీల భవన వ్యర్థాలను నింపి లెవలింగ్ చేశారు.
-
ప్రమాదం జరిగిన రోజే గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణ స్థలం పెంచేందుకు కీలకమైన పిల్లర్ గోడను తొలగించారని, ఆ బరువు మోయలేక భవనం పేకమేడలా కూలిపోయిందని దర్యాప్తులో తేలింది.
-
ఆ ఘటనలో లేబర్ కాంట్రాక్టర్ సనోజ్ కుమార్ను ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో అరెస్ట్ చేయగా, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని నెలకు రూ.1.05 లక్షలకు లీజుకు తీసుకుని నిర్లక్ష్యంగా పీజీ నడుపుతున్న ఆపరేటర్ శుద్ధాన్షు లవ్నీశ్ను కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
తాజాగా న్యూ సీమాపురిలో కూలిన భవనానికి కూడా పాత నిర్మాణం కావడం, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేయడమే కారణమా అనే కోణంలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి శిథిలాల కింద ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీయడమే ప్రాధాన్యతగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
