Janasena: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బుధవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు పాల్గొని, పార్టీలో చేరిన వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
విజయవాడ పరిధి నుంచి 300 మంది చేరిక..
పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌తో పాటు గన్నవరం నియోజకవర్గానికి చెందిన సుమారు 300 మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు.
వైసీపీ నాయకులు మధుసూదన్, కటకం జ్యోతి, ఆల్లూరి శంకర్, మర్రి బెంజిమన్, సీపీఎం సీనియర్ నేత కొంపెల్ల భాను లక్ష్మి నారాయణలతో పాటు పలు విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు పార్టీలో చేరారు.
పవన్ కళ్యాణ్ కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.. నాగబాబు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు ప్రసంగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. “పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలందరినీ తన సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు దక్కుతుంది. ఆ గుర్తింపు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ తప్పక వస్తుంది. నాతో సహా ఈ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికీ అలానే గుర్తింపు దక్కింది” అని నాగబాబు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ పరంగా కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
జనసైనికులకు ఆటోలు, స్వయం ఉపాధి ఉపకరణాల పంపిణీ..
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, సామాన్యుల ఆర్థిక స్వావలంబన కోసం అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి సేవా కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు:
-
40 మంది జనసైనికులకు: జీవనోపాధి కోసం ఆటో రిక్షాలు.
-
25 మంది వీరమహిళలకు: స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్లు.
-
25 మంది చిరు వ్యాపారులకు: వ్యాపారాల కోసం తోపుడు బండ్లు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నిరుపేదల ఉపాధికి తోడ్పడేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
