Ramchander Rao

Ramchander Rao: ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేవు కానీ ఢిల్లీకి మూటలు పంపడానికి ఉన్నాయా?

Ramchander Rao: నెహ్రూ కుటుంబంలోని వ్యక్తి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోలేకపోతున్నారన్న అక్కసుతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిందలు వేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ చట్టబద్ధంగా ఎన్నికల్లో గెలుస్తుంటే ఓర్వలేక ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్లు ఎన్నికల్లో అక్రమాలు జరిగి ఉంటే.. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా అక్రమంగానే గెలిచినట్లా అని ప్రశ్నిస్తూ.. వారందరితో తక్షణమే రాజీనామా చేయించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.
రేవంత్ బ్రదర్స్ బాగుపడుతున్నారు.. తెలంగాణ ప్రజలు కాదు..
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచందర్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం బాగుపడితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ‘రేవంత్ బ్రదర్స్’ బాగుపడుతున్నారు తప్ప సామాన్య తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు ఉండవు కానీ.. అధిష్ఠానం కోసం దిల్లీకి మూటలు పంపడానికి మాత్రం పుష్కలంగా డబ్బులు ఉంటున్నాయి” అని ఆరోపించారు.
“మీరు గెలిస్తే ఈవీఎంలు, వ్యవస్థలు మంచివి అవుతాయి.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి బీజేపీని గెలిపిస్తే మాత్రం ఎన్నికల కమిషన్, ఈవీఎంలు తప్పుగా కనిపిస్తాయా?” అంటూ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
ఫారమ్-6, 7 మరియు SIR ప్రక్రియపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం..
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR), ఫారమ్‌ల వివాదంపై రామచందర్‌రావు వాస్తవాలను వివరించారు. ఓటరు నమోదు కోసం వినియోగించే ఫారమ్-6, తొలగింపులకు వాడే ఫారమ్-7లను బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

 

గతంలో 12 సార్లు కాంగ్రెస్ హయాంలోనే SIR..
1952 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలోనే 12 సార్లు ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) జరిగిందని.. మరి ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ చట్టవిరుద్ధమేనా అని ప్రశ్నించారు. 2025 జూన్ 24న బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగిందని, దీనికి సుప్రీంకోర్టు ఆమోదం కూడా ఉందని స్పష్టం చేశారు.
చనిపోయిన 2.8 కోట్ల ఓట్ల తొలగింపుపై ఎందుకు అభ్యంతరం?..
ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశవ్యాప్తంగా చనిపోయిన 2.8 కోట్ల మంది బోగస్ ఓట్లను జాబితా నుంచి తొలగించాలా వద్దా? 2018 ఎన్నికల సమయంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో లక్షలాది నకిలీ, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని స్వయంగా రాహుల్ గాంధీ, కమల్‌నాథ్, సచిన్ పైలట్ ఆరోపించలేదా?
నాడు నకిలీ ఓట్లను తీసేయాలన్న నేతలు.. నేడు ఎన్నికల సంఘం పారదర్శకంగా జాబితాను శుద్ధి చేస్తుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?” అని ప్రశ్నించారు. దేశంలో 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ చేస్తున్న వ్యాఖ్యలకు కనీస ఆధారాలు చూపాలని ఆయన సవాల్ చేశారు.
ఈవీఎంలను తెచ్చింది రాజీవ్ గాంధీ కాదా?
దేశంలో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈవీఎం (EVM) మెషీన్లను ప్రవేశపెట్టింది నాటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని రామచందర్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే రాజీవ్ గాంధీ తెచ్చిన విధానాన్నే ఆయన కుమారుడు రాహుల్ గాంధీ తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ప్రజాస్వామ్య వ్యవస్థలపై బురదజల్లడం మానుకోవాలని, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *