Supreme Court: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో (NCR) మహిళలు, మైనర్ బాలికలపై వరుసగా జరుగుతున్న దారుణమైన లైంగిక నేరాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై వికృత చేష్టలకు పాల్పడే మృగాళ్లకు పోలీసులు, చట్టం అంటే వెన్నులో వణుకు పుట్టాలని, “ఇలాంటి నేరం చేస్తే మనం చచ్చిపోతాం” అన్న చావు భయం నేరగాళ్లలో కలిగినప్పుడే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని అత్యున్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ అంశంపై ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులను నేరుగా నిలదీస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడు ఏమైనా చేస్తే చచ్చిపోతాం అని భయపడాలి.. జస్టిస్ పార్డీవాలా
-
పోలీస్ పెట్రోలింగ్ ఒకేచోట ఆగకూడదు:పోలీస్ వాహనాలు ఒకేచోట గంటల తరబడి పార్క్ చేసి నిల్చోవడం సరికాదని, నిరంతరం ఏరియాల్లో మొబైల్ పెట్రోలింగ్ తిరుగుతూనే ఉండాలని ఆదేశించింది.
-
అక్రమ దాబాలు, మద్యం దుకాణాలపై ఉక్కుపాదం:కళాశాలల పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, అక్రమంగా నడిచే ఈటరీలు, దాబాలు, మద్యం అడ్డాలను వెంటనే మూసివేయించాలని ఆదేశించింది. పోకిరీలు, రౌడీలు ఇలాంటి చోట్లే గుమిగూడి మద్యం మత్తులో మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది.
-
పండుగల సీజన్ హెచ్చరిక:దుర్గాపూజ, దీపావళి వంటి పండుగల సమయం వస్తోంది కాబట్టి అసాంఘిక శక్తులు మద్యం మత్తులో రెచ్చిపోయే ప్రమాదం ఉందని, తక్షణమే అంధకారంగా ఉండే వీధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పహారా పెంచాలని ఆదేశించింది.
-
సీసీటీవీ మానిటరింగ్ & వార్ రూమ్స్:కేవలం నేరం జరిగిన తర్వాత దర్యాప్తు కోసం కాకుండా.. నేరాన్ని ముందే ఆపడానికి లైవ్ సీసీటీవీ మానిటరింగ్ జరగాలని స్పష్టం చేసింది. మహిళా భద్రత కోసం ప్రత్యేక ‘వార్ రూమ్’లు ఏర్పాటు చేసి, లైంగిక నేరస్థుల జాతీయ డేటాబేస్ (NDSO) ద్వారా పాత నేరస్థులపై కన్నేసి ఉంచాలని సూచించింది.
రాబోయే నాలుగు వారాల్లో రాజధానిలో ఇలాంటి వికృత నేరాలు మళ్లీ పునరావృతం కాకూడదని, ప్రజలు లేదా హక్కుల సంఘాల నుంచి ఏవైనా నిరసనలు వచ్చినా మహిళల రక్షణ కోసం పోలీసులు రాజీలేని పోరాటం చేయాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
