Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అంటే స్పీడ్.. ఇక్కడ చంద్రబాబు సాఫ్ట్‌వేర్, మేము యంగ్ హార్డ్‌వేర్!

Nara Lokesh: విజయవాడ-అమరావతి వేదికగా దేశంలోనే అత్యున్నత మేధో సంపత్తికి నిలయమైన ‘పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్’ (PAN IIT AP Summit) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేశంలోని 23 ఐఐటీలకు చెందిన దాదాపు 5 లక్షల మంది పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్, ప్రపంచ స్థాయి కంపెనీల ఫౌండర్లు, సీఈవోలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులతో ఈ సదస్సు కిటకిటలాడింది. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి (HRD) శాఖ మంత్రి నారా లోకేశ్.. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణం, టెక్నాలజీ విజన్, పారిశ్రామిక విప్లవంపై చేసిన స్పీచ్ యావత్ సభికులను మంత్రముగ్ధులను చేసింది.

చంద్రబాబు సాఫ్ట్‌వేర్.. మేము యంగ్ హార్డ్‌వేర్!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఎవరికీ ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆపరేటింగ్ సిస్టమ్‌లో వెర్షన్ 1.0, 2.0, 3.0 చూశారు.. ఇప్పుడు ఆయన ‘బాబు 4.0’ వెర్షన్‌లో ఉన్నారు. ఏ ఓఎస్ అయినా కొత్త వెర్షన్‌లో మరింత పవర్‌ఫుల్‌గా మారినట్లే చంద్రబాబు మరింత మెరుగయ్యారు.

ఈసారి మా ప్రభుత్వంలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన వారే. 25 మంది మంత్రుల్లో ఏకంగా 17 మంది తొలిసారి బాధ్యతలు చేపట్టిన యువకులే. చంద్రబాబు అనుభవజ్ఞుడైన ‘సాఫ్ట్‌వేర్’ అయితే.. మేమంతా ఎనర్జిటిక్ ‘యంగ్ హార్డ్‌వేర్’! ఈ సాఫ్ట్‌వేర్-హార్డ్‌వేర్ కాంబినేషనే ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే సరికొత్త శక్తిగా నిలబెడుతోంది. వ్యవస్థను మార్చేందుకే మేం వచ్చాం.. స్టేటస్-కో (Status Quo)తో సరిపెట్టుకోం” అని స్పష్టం చేశారు.
గోల్డెన్ డికేడ్ మనదే – 3S మంత్రం (Speed, Service, Stability)..
ప్రపంచ దేశాల ఆర్థిక ప్రగతిని పోలుస్తూ లోకేశ్ స్పూర్తిదాయక విషయాలు వెల్లడించారు. అమెరికా, యూరప్ అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి 100 ఏళ్లు పట్టింది. దుబాయ్ 30 ఏళ్లు, సింగపూర్ 25 ఏళ్లు తీసుకున్నాయి. కానీ రాబోయే ఒక్క దశాబ్దం (10 ఏళ్లు)లోనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోంది. ఆ ‘గోల్డెన్ డికేడ్’ మనదేనని, ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ విజన్‌లో ఏపీ నంబర్ వన్ పాత్ర పోషిస్తుందన్నారు.
ఏపీ ప్రభుత్వం 3S మంత్రంతో దూసుకుపోతోందని చెప్పారు..
    1. Speed (వేగం): కేవలం ఒప్పందాలు (MoU) చేసుకోవడం మాత్రమే కాదు.. వెంటనే గ్రౌండింగ్ చేసి కంపెనీలు, ఉద్యోగాలు తేవడమే మా వేగం. ఏపీ అంటేనే స్పీడ్‌కు ప్రతీక.
    2. Service (సేవ): ఇన్వెస్టర్లను మేం దేశ నిర్మాతలుగా చూస్తాం. టాప్ ప్రాజెక్టుల పురోగతిని ప్రతి శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం స్వయంగా నేనే పారిశ్రామికవేత్తలకు వాట్సాప్‌లో పర్సనల్ అప్‌డేట్ ఇస్తాను.
    3. Stability (స్థిరత్వం): ప్రభుత్వాలు మారినా మారని పటిష్ట విధానాలు ఉండాలి. ఇటీవల 16,000 మంది ఉపాధ్యాయుల నియామకానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పాత కోర్టు కేసుల డేటాను ఏఐ (AI Engine)లో వేసి విశ్లేషించి పక్కా జీవో తెచ్చామని గుర్తుచేశారు.

గూగుల్ నుంచి స్కైరూట్ వరకు.. ఏపీ సాధించిన ఘనతలు..

రాష్ట్రంలో పెట్టుబడులు ఎంత వేగంగా వస్తున్నాయో లోకేశ్ లైవ్ ఉదాహరణలతో వివరించారు..
  • వైజాగ్‌లో గూగుల్ (Google): వైజాగ్ పేరులోని ‘G’ అక్షరం గూగుల్ లోగోగా మారి విశాఖను ప్రపంచ పటంలో నిలిపింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్‌లతో సమన్వయం చేసుకుని కేవలం 13 నెలల్లోనే గూగుల్ ప్రాజెక్టును గ్రౌండింగ్ చేశాం.
  • ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్: ఇతర రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న 17 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను ఆదిత్య మిట్టల్‌తో జూమ్ కాల్ మాట్లాడిన నాటి నుంచి పర్యావరణ అనుమతులతో సహా రికార్డు స్థాయిలో 17 నెలల్లోనే గ్రౌండింగ్ చేశాం.
  • స్కైరూట్ స్పేస్ సిటీ: ఏడాది క్రితం ఎవరికీ పెద్దగా తెలియని ‘స్కైరూట్’ ఏరోస్పేస్ స్టార్టప్‌ను గుర్తించి, ఏపీ కేబినెట్‌ను 30 నిమిషాల్లో ఒప్పించి ఊహించని ధరకు 300 ఎకరాలు కేటాయించాం.
  • సాగర్ డిఫెన్స్ డ్రోన్లు: ఫిషింగ్ హార్బర్‌లో వాటర్ ఫ్రంటేజ్ కోరినప్పుడు 150 మీటర్లు కేటాయించాం. మా దగ్గరకు వచ్చినప్పుడు వారి విలువ ₹3,000 కోట్లు కాగా.. కేవలం 18 నెలల్లో నేడు ₹23,000 కోట్లకు చేరింది.
  • నమో (NaMo) అంటే నాయుడు-మోదీ జోడీ: కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు కలయిక ఏపీని డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలులా నడిపిస్తోంది.

23 పారిశ్రామిక క్లస్టర్లు – అగ్రికల్చర్ నుంచి క్వాంటమ్ వరకు..

మొబైల్ తయారీలో కెమెరా, గ్లాస్, బ్యాటరీ విడిభాగాలన్నీ ఒకే చోట దొరికేలా క్లస్టర్ వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ఆక్వాకల్చర్, మెడికల్ డివైసెస్, ఫార్మా, కెమికల్స్, ఆటోమోటివ్, సిమెంట్, సోలార్ వేఫర్స్, స్పేస్, డ్రోన్లతో పాటు మొత్తం 23 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం.
రెన్యూవబుల్ ఎనర్జీలో గత ఐదేళ్లలో (2019-24) కేవలం 6 మెగావాట్లు వస్తే.. కూటమి వచ్చిన ఏడాదిలోనే ఏకంగా 4.8 గిగావాట్లు సాధించాం. దేశంలో 3వ స్థానంలో ఉన్నామని, ప్రతీ ఏటా 20 గిగావాట్లు జోడించి నంబర్ వన్ కావడమే లక్ష్యమన్నారు. విద్యారంగంలోనూ ఐఐటీ తిరుపతి, న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలతో కలిసి సోలార్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, అమరావతిలో బిట్స్ పిలానీతో సహా ఇప్పటికే 6 వర్సిటీలు రీసెర్చ్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నాయని చెప్పారు.
అమరావతిలో 5,000 ఎకరాల్లో భారీ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్!.. 
రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతాలను లోకేశ్ వివరించారు. “ప్రస్తుతం గన్నవరం-విజయవాడలో ఉన్నది తాత్కాలిక ఎయిర్‌పోర్ట్ మాత్రమే. అసలైన అద్భుతం అమరావతిలో రాబోతోంది. నాడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం చంద్రబాబు 5,000 ఎకరాలు తీసుకుంటే విమర్శించారు.. కానీ ఆ నిర్ణయమే నేడు హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేసింది. అదే తరహాలో అమరావతిలో ఏకంగా 5,000 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మించబోతున్నాం. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కంటే మిన్నగా ఇది ఉంటుంది.

ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ డిజైన్లతో అమరావతి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి 100 రోజులకు ఒకసారి అమరావతిని సందర్శిస్తే ప్రగతి ఏంటో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నేనొక యువ భారతీయుడిగా ఇతర దేశాల మోడళ్ల గురించి మాట్లాడటం బోర్ కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి సరికొత్త అభివృద్ధి నమూనాను చూపించబోతున్నాం. ఐఐటీ పూర్వ విద్యార్థులు తమ గ్లోబల్ పరిచయాలతో ఏపీ రీసెర్చ్ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. మీ అందరి కోసం నేను ఒక్క వాట్సాప్ మెసేజ్ దూరంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను” అంటూ లోకేశ్ ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *