Bus Accident: వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన 54 మంది ఓ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంట గ్రామానికి బస్సులో బయల్దేరారు. వికారాబాద్ నుంచి తాండూరు వైపు వెళ్తుండగా, అనంతగిరి కొండ పైనుంచి కిందికి దిగే ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టింది.
సహాయక చర్యలు – ఇద్దరి పరిస్థితి విషమం..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల ద్వారా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
