Nightclub

Nightclub: యువతిని వివస్త్రను చేసి బౌన్సర్ల రాక్షస దాడి..!

Nightclub: అస్సాం రాజధాని గౌహతిలో మానవత్వం సిగ్గుపడేలాంటి అత్యంత హేయమైన, రాక్షస ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నైట్‌క్లబ్‌లో యువతిని బలవంతంగా వివస్త్రను చేసి.. మహిళా, పురుష బౌన్సర్లు విచక్షణారహితంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా నాలుగో అంతస్తు నుంచి కింది పార్కింగ్ ప్రాంతం వరకు ఆమెను ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో తీవ్ర ప్రజాందోళన వ్యక్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది? – అర్ధరాత్రి పబ్‌లో రాక్షసకాండ..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గౌహతిలోని ఖానాపరా పరిధిలో ఉన్న ‘ది లోకల్స్ కేఫ్ అండ్ లాంజ్’ (The Locals Cafe and Lounge) నైట్‌క్లబ్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పబ్ లోపల యువతిని బలవంతంగా కిందకు తోసేసి, ఒంటిపై దుస్తులు లేకుండా నేలపై పడి ఉన్న ఆమెను మహిళా బౌన్సర్లు ఏమాత్రం కనికరం లేకుండా కాళ్లతో తన్నుతూ, చేతులతో తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆమె తీవ్రంగా రోదిస్తూ వేడుకుంటున్నా చుట్టూ ఉన్న కొందరు పురుషులు కేవలం మూగప్రేక్షకుల్లా చూస్తూ నిలబడ్డారు. మరొక వీడియోలో వేరొక మహిళ బాధితురాలికి సాయం చేసేందుకు ప్రయత్నించడం, ఆ వెంటనే ఓ కారు అడ్డురావడం కనిపించాయి.
దాడి తీవ్రత అంతటితో ఆగలేదు. బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తు నుంచి కింది గ్రౌండ్ పార్కింగ్ ఏరియా వరకు బాధితురాలిని బౌన్సర్లు ఈడ్చుకెళ్లి మరీ చిత్రహింసలకు గురిచేశారు. అక్కడున్న కొందరు ఎంత వారిస్తున్నా బౌన్సర్లు తమ దాడిని ఆపకుండా రాక్షసంగా ప్రవర్తించారు.
ఘర్షణకు అసలు కారణమేంటి? – పబ్ మూసివేత..
ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు..తొలుత పబ్‌లో బాధితురాలికి, ఓ మహిళా బౌన్సర్‌కు మధ్య జరిగిన చిన్నపాటి మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బాధితురాలు ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
ఘటన తర్వాత మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునే సమయానికి యాజమాన్యం పబ్‌ను పూర్తిగా మూసివేసి పరారైంది. క్లబ్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ప్రస్తుతం అధికారులు ఆ పబ్‌ను సీజ్ చేశారు.
రంగంలోకి పోలీసులు – నిందితుల కోసం గాలింపు..
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో దృశ్యాలను తీవ్రంగా పరిగణించిన గౌహతి పోలీసులు ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేశారు. పబ్‌లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలు, మొబైల్ వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన మహిళా, పురుష బౌన్సర్లను గుర్తించే పనిలో పడ్డారు.

నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళపై ఇంతటి పాశవిక దాడికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని నగర ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *