Fire Accident

Fire Accident: శ్రీసిటీలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి.. !

Fire Accident: తిరుపతి జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీసిటీలో శనివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సత్యవేడు మండలం శ్రీసిటీ సెజ్ పరిధిలోని ‘టీఐఎల్ హెల్త్‌కేర్’ (TIL Healthcare) పరిశ్రమలో భారీ శబ్దంతో బాయిలర్ పేలిపోయింది. ఈ భయానక ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు, శిథిలాలతో భీతావహంగా మారింది.

అసలేం జరిగింది? – నైట్ షిఫ్ట్ వేళ ఊహించని విపత్తు..

పరిశ్రమలో రోజూలాగే నైట్ షిఫ్ట్ విధులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము సమయంలో ప్రొడక్షన్ యూనిట్ వద్ద సుమారు 30 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అనుకోకుండా ఫ్యాక్టరీలోని వాటర్ బాయిలర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ప్లాంట్‌లోని ఇనుప భాగాలు, పైపులు తునాతునకలయ్యాయి.
ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయినవారి వివరాలను అధికారులు నిర్ధారిస్తున్నారు.
12 మందికి గాయాలు – ఆసుపత్రికి తరలింపు..
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, శ్రీసిటీ డిజాస్టర్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 12 మంది క్షతగాత్రులను రక్షించి వెంటనే శ్రీసిటీలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి..
శ్రీసిటీ హెల్త్‌కేర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో సీఎం స్వయంగా మాట్లాడి ప్రమాద తీవ్రతను, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ప్రభుత్వం అన్ని విధాలా బాధిత కుటుంబాలను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత స్పందన..
ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో హోంమంత్రి ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కష్టపడి పనిచేసుకునే కార్మికులు విధి నిర్వహణలో ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రమాదానికి గల సాంకేతిక లోపాలు, యాజమాన్య నిర్లక్ష్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరిశ్రమలో భద్రతా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? బాయిలర్ నిర్వహణలో సాంకేతిక లోపాలు ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *