అయితే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం ఏమీ జరగలేదని, కార్మికులంతా సురక్షితంగా బయటకు వచ్చారని అధికారులు, యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, స్థానికుల అనుమానాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అసలు ఏం జరిగింది? – గురువారం సాయంత్రం క్షణక్షణం భయం భయం!
షిఫ్ట్ మార్పిడి వేళ విరిగిపడ్డ కొండ..
గురువారం సాయంత్రం 4:55 నుంచి 5:00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు క్వారీలో బ్లాస్టింగ్ (పేలుళ్లు) సమయం కావడంతో పాటు, షిఫ్ట్ మార్పిడి సమయం కావడంతో కార్మికులు క్వారీ లోపలి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ విపత్తు చోటుచేసుకుంది. సుమారు ఏడు నిమిషాల పాటు రాళ్లు నిరంతరాయంగా జారిపడుతూనే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రూ.3 కోట్ల ఆస్తి నష్టం – 4 పొక్లెయిన్లు ధ్వంసం..
ఈ ప్రమాదంలో క్వారీ అడుగుభాగంలో పనిచేస్తున్న దాదాపు రూ.3 కోట్ల విలువైన భారీ యంత్రాలు, నాలుగు అత్యాధునిక పొక్లెయిన్లు ఆ భారీ గ్రానైట్ రాళ్ల కింద నలిగిపోయాయి.
పోలీసుల తనిఖీలు..
సమాచారం అందిన వెంటనే చీమకుర్తి ఎస్సై ఎల్.సంపత్‌కుమార్, ఒంగోలు రూరల్ సీఐ ఎం.శేషగిరిరావు, సంతనూతలపాడు ఎస్సై వేజెండ్ల అజయ్‌బాబు, డీఎస్పీ శ్రీనివాసరావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉదయం షిఫ్ట్‌లో 72 మంది వచ్చారని, సాయంత్రం హాజరు పరిశీలించగా అందరూ బయటకు వచ్చినట్లు నమోదైందని పోలీసులు తెలిపారు.
తప్పిన ప్రాణనష్టం నిజమేనా? లేక నిజాలు దాచేస్తున్నారా?
క్వారీ యాజమాన్యం చెబుతున్న లెక్కలకు, స్థానికులు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.
అరగంట ముందు జరిగుంటే ఘోర విపత్తే..
నిజంగానే కార్మికులంతా పైకి వచ్చేసిన సమయంలో ఇది జరిగి ఉంటే అదృష్టవశాత్తూ పెను ప్రమాదమే తప్పినట్లు లెక్క. ఒకవేళ కేవలం పది నిమిషాలు లేదా అరగంట ముందు ఈ కొండచరియలు విరిగిపడి ఉంటే.. పదుల సంఖ్యలో కార్మికులు సమాధి అయిపోయేవారని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.
రిజిస్టర్లో లేని రోజువారీ కూలీల సంగతేంటి?..
ఈ క్వారీల్లో ఒడిశా, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు భారీ సంఖ్యలో పనిచేస్తుంటారు. వారిలో చాలామంది పేర్లు అధికారిక రిజిస్టర్లలో నమోదు కావని, అలాంటి రోజువారీ కూలీలు ఎవరైనా లోపల చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారా అనే భయాందోళనలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారు?..
ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితిని కవర్ చేయడానికి వెళ్లిన ‘మహా న్యూస్’ రిపోర్టర్లను క్వారీ సెక్యూరిటీ, రాఘవరెడ్డి లిమిటెడ్ కంపెనీ (మిడ్వెస్ట్ లిమిటెడ్) ప్రతినిధులు లోపలికి వెళ్లకుండా దౌర్జన్యంగా అడ్డుకున్నారు. “ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కదా.. మిమ్మల్ని లోపలికి ఎందుకు పంపించాలి?” అంటూ రివర్స్ ప్రశ్నలు వేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అసలు లోపల ఏమీ జరగకపోతే మీడియాను క్వారీ పరిసరాల్లోకి ఎందుకు రానివ్వడం లేదు? అక్కడ ఏం దాచే ప్రయత్నం చేస్తున్నారు? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ధనదాహం.. భద్రతా నిబంధనలు గాల్లోకి!..
చీమకుర్తి పరిసరాల్లో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్టకు చేరాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితమే వివిధ లేయర్లలోని బండల జాయింట్లు విడిపోతున్నట్లు కనిపించినా.. ఏ క్షణమైనా ప్రమాదం జరగొచ్చని తెలిసినా యాజమాన్యం లాభాల కక్కుర్తితో మైనింగ్ ఆపలేదని కార్మికులు వాపోతున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన హైలెవల్ జాయింట్లు ఓపెన్ అవ్వడం వల్లే ఈ ర్యాంప్ కుప్పకూలినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
మూడు షిఫ్టుల దోపిడీ..
చీమకుర్తి ప్రాంతంలో ఏ క్వారీలోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రాత్రీ పగలూ తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో పనులు చేయిస్తున్నారు.
అధికారుల అవినీతి…
గనుల భద్రతా విభాగం అధికారులు ఏనాడూ ఈ ఉల్లంఘనలపై కన్నెత్తి చూడలేదు. ఇటీవల డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DDMS) శివశంకర్ స్వయంగా క్వారీ నిర్వాహకుల వద్ద లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడమే ఇక్కడి వ్యవస్థల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం, గనుల శాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి.. శిథిలాల కింద నిజంగా ఎవరూ చిక్కుకోలేదా అన్నది పూర్తిస్థాయిలో తేల్చాలని, నిబంధనలు పాటించని క్వారీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.