1. ఆహారంలో మార్పులు – ఉప్పుకు కట్టడి:
పచ్చళ్లు, కారాలు, ప్యాక్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో సోడియం (ఉప్పు) అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును వేగంగా పెంచుతుంది. జంక్ ఫుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టి.. తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు మరియు కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.
2. క్రమం తప్పని రోజువారీ వ్యాయామం:
రోజువారీ శారీరక శ్రమ గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవటం (బ్రిస్క్ వాకింగ్), స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ చేయడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి బీపీ అదుపులో ఉంటుంది.
3. శరీర బరువు నియంత్రణ:
శరీరంలో కొవ్వు, బరువు పెరిగే కొద్దీ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి గుండెపై అదనపు భారం పడుతుంది. సమతుల్య ఆహారం, నిరంతర శారీరక శ్రమ ద్వారా బరువు తగ్గించుకుంటే రక్తపోటు కూడా దానంతట అదే తగ్గుముఖం పడుతుంది.
4. స్లీప్ ఆప్నియాను నిర్లక్ష్యం చేయవద్దు:
రాత్రిపూట తీవ్రమైన గురక పెట్టడం, శ్వాస అందక ఉలిక్కిపడి లేవడం, పగటివేళల్లో తీవ్ర అలసట ఉండటం ‘స్లీప్ ఆప్నియా’ లక్షణాలు. ఇది నిద్రలో శరీరానికి ఆక్సిజన్ సరఫరాను తగ్గించి బీపీని ప్రమాదకర స్థాయికి పెంచుతుంది. ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
5. బీపీ మందులు వాడటం ఓటమి కాదు:
జీవనశైలి మార్పులు చేసుకున్నా కొందరిలో వంశపారంపర్య (జన్యుపరమైన) కారణాల వల్ల బీపీ తగ్గకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. మందులు వాడటాన్ని మీ ఆరోగ్య ప్రయత్నాల్లో ఓటమిగా భావించకూడదు.
6. ఇంట్లోనే బీపీని తరచూ చెక్ చేసుకోవడం:
డిజిటల్ మానిటర్‌తో ఇంట్లోనే తరచూ బీపీ రీడింగ్స్ రికార్డ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా 120/80 mmHg రీడింగ్‌ను సరైనదిగా పరిగణిస్తారు. వయసు, ఆరోగ్య స్థితిని బట్టి ఇందులో ఏవైనా తీవ్ర మార్పులు కనిపిస్తే సొంత ప్రయోగాలు చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.