KTR

KTR: అసమర్థత ప్రోమ్యాక్స్.. అవినీతి అల్ట్రామ్యాక్స్.. అరాచకం ఐమ్యాక్స్!

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ వైఫల్యాలపై అధికారికంగా ఛార్జ్‌షీట్ విడుదల చేసిన ఆయన, ఇది ప్రజల పాలన కాదని.. దరిద్రం దండయాత్ర మొదలై వెయ్యి రోజులు అయిందని మండిపడ్డారు.

420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో “ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం” అని కేటీఆర్ విమర్శించారు. సెక్రటేరియట్‌లోనే ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలకు దిగే దుస్థితి రావడం ఈ అసమర్థ పాలనకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
రైతాంగానికి తీరని ద్రోహం – దేవుళ్లపై ఒట్లు పెట్టి టోపీ..
రూ. 50 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు పెట్టి మాట తప్పారని, చివరకు రూ. 20 వేల కోట్లతో చేతులు దులుపుకుని అన్నదాతలకు టోపీ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ కోతలు, యూరియా కొరత, రైతు బంధు అందక రైతులు ధాన్యం కుప్పల మీదే ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు పోయి.. ఢిల్లీకి మూటలు పంపే ‘రాహుల్ బంధు’ మొదలైందని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో నీళ్లు విడుదల చేయకుండా రైతులను శిక్షిస్తున్నారని విమర్శించారు. అందాల పోటీలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. అందులో పదోవంతు వెచ్చిస్తే కాఫర్ డ్యామ్ పూర్తవుతుందని ఇంజినీర్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. పైగా ప్రశ్నించిన ఇంజినీర్లకు ‘బెల్ట్ ట్రీట్‌మెంట్’ ఇస్తానంటూ సీఎం బెదిరించడం సిగ్గుచేటన్నారు.

నిరుద్యోగులతో ఆటలు – సెప్టెంబర్ 7 నుంచి పోరుబాట..

అసెంబ్లీ సాక్షిగా ఖాళీలు లేని డమ్మీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు అడిగితే లాఠీలతో కొట్టిస్తున్నారని, బావుల్లో దూకమని మంత్రులు దురహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని, ఈ నెల 7 నుంచి జాబ్ క్యాలెండర్‌పై రాష్ట్రవ్యాప్త పోరాటం ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా కాలేజీలను బెదిరిస్తున్నారని, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. 20 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే కుట్ర చేస్తున్నారని, పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్టకొట్టే జీవో నెం. 97పై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

అవినీతి అనకొండ – రూ.4.5 లక్షల కోట్ల అప్పులు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి సెక్షన్ 22A పేరుతో విలువైన భూములను కొల్లగొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడకుండా ఢిల్లీ అధిష్టానం ముందు మోకరిల్లుతున్న ‘సిల్లీ ప్రభుత్వం’ ఇదన్నారు.
కమిషన్లు, పర్సంటేజీల వాటాల కోసం సీఎం, మంత్రులు కుక్కలు చింపిన విస్తరిలా కొట్లాడుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1000 రోజుల్లో ఏకంగా రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు.

కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న రేవంత్.. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన త్యాగాలు, రాజీనామాల వల్లే తెలంగాణ వచ్చిందనే నిజాన్ని మరచిపోయారని, కేసీఆర్ పోరాడకపోతే అసలు రేవంత్‌కు సీఎం కుర్చీ దక్కేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *