BRS

BRS: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్.. కేటీఆర్, హరీశ్‌రావుల నిప్పుల వర్షం!

BRS: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇతర సీనియర్ నేతలతో కలిసి అధికారికంగా ‘ఛార్జ్‌షీట్’ను విడుదల చేశారు. 100 రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ వెయ్యి రోజుల్లో రాష్ట్ర ప్రజలకు నరకం చూపించిందని నేతలు మండిపడ్డారు.

దరిద్రం దండయాత్ర చేసి 1000 రోజులైంది  – కేటీఆర్ ధ్వజం..

కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది పూర్తి సర్వభ్రష్ట పాలన అని, రేవంత్ రెడ్డి శైలిలో చెప్పాలంటే ఈ వెయ్యి రోజుల పాలన ఒక ‘క్రిమినల్ వేస్ట్’ అని కేటీఆర్ విమర్శించారు. నాలుగు తలల నాగుపాములా కాంగ్రెస్ పాలన బుసలు కొడుతోందన్నారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రకటించిన ‘అభయహస్తం’ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో సచివాలయంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలకు దిగే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు.

 

రూ.4.5 లక్షల కోట్ల అప్పులు – భూముల కొల్లగొట్టుడు..
ఈ 1000 రోజుల్లో ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. సెక్షన్ 22A పేరుతో భూములను కొల్లగొడుతూ అవినీతి అనకొండలా వ్యవహరిస్తున్నారని.. ఈ పాలన “అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్” లా మారిందని ఎద్దేవా చేశారు.

 

ఢిల్లీ ముందు మోకరిల్లిన ప్రభుత్వం..
రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ నీటి హక్కులను కాపాడకుండా ఢిల్లీ అధిష్టానం ముందు మోకరిల్లుతున్నారని, ముఖ్యమంత్రి మరియు మంత్రులు కుక్కలు చింపిన విస్తరిలా కొట్లాడుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అన్ని రంగాలు కుప్పకూలాయి – హరీశ్‌రావు ఆవేదన..

కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యవసాయం, తాగు-సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, శాంతిభద్రతల రంగాలు కాంగ్రెస్ హయాంలో పూర్తిగా కుప్పకూలిపోయాయని హరీశ్‌రావు మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని నమ్మబలికి, వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వైపు పరుగులు తీయాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పాలకులు తిరోగమనం వైపు తీసుకెళ్లారని ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *