Ayodhya Ram Mandir CEO: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ పాలనా వ్యవహారాల్లో పారదర్శకత, భద్రత, సమర్థవంతమైన నిర్వహణను మరింత పెంచే లక్ష్యంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతోంది. ఆలయ విస్తరిస్తున్న కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నియామకాన్ని ఖరారు చేయడానికి ట్రస్ట్ బుధవారం అయోధ్యలోని మణిరామ్‌దాస్ జీ చావనీలో ప్రత్యేక సమావేశం కానుంది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఈవో ఖరారుతో పాటు ఇటీవల వచ్చిన కానుకల చోరీ ఆరోపణల దర్యాప్తు, ట్రస్ట్ డీడ్ సవరణలపై చర్చించనున్నారు.
పరిశీలనలో ముగ్గురి పేర్లు..
-
రాజేష్ పాండే: యూపీ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి. పోలీస్, భద్రత ఇంకా అతిపెద్ద జనసందోహాల నిర్వహణలో (ఈవెంట్ మేనేజ్‌మెంట్) విశేష అనుభవం ఉంది.
-
యోగేశ్వర్‌రామ్ మిశ్రా: యూపీ మాజీ ఐఏఎస్ అధికారి. పాలనాపరమైన వ్యవహారాలు, ఉన్నత స్థాయి అధికార వ్యవస్థల పర్యవేక్షణలో అనుభవం గల వ్యక్తి.
-
డా. పరేష్ సక్సేనా: బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. పోలీసు శాఖతో పాటు వైద్య రంగ నేపథ్యం కూడా ఉన్న అధికారి.
ట్రస్ట్ బోర్డు పునర్వ్యవస్థీకరణ – కీలక మార్పులు..
జగదీశ్ ఆఫ్లే పేరు తెరపైకి..
పుణేకు చెందిన విద్యావేత్త, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన జగదీశ్ ఆఫ్లే గతంలో ఆలయ ప్రాజెక్ట్ మేనేజర్‌గా సేవలు అందించారు. కీలకమైన నిర్వహణ బాధ్యతల్లో ఆయనతో పాటు వీహెచ్‌పీ నేత భజరంగ్ లాల్ బాగ్డా వంటి ప్రముఖుల పేర్లు కూడా ట్రస్ట్ పరిశీలనలో ఉన్నాయి.
సమావేశంలో పాల్గొంటున్న ప్రముఖులు..
ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్‌దేవ్ గిరి, శంకరాచార్య స్వామి వాసుదేవానంద్, స్వామి పరమానంద్, మహంత్ దినేంద్రదాస్, అయోధ్య కలెక్టర్ శశాంక్ త్రిపాఠి ప్రత్యక్షంగా హాజరవుతుండగా.. సీనియర్ న్యాయవాది కె. పరాశరన్, యూపీ హోంశాఖ కార్యదర్శి సంజయ్ ప్రసాద్, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్నారు. సమావేశం ముగిసిన వెంటనే తొలి సీఈవో ఎవరు అనేది ట్రస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
