Highest Paid CEO: అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ‘వెల్‌టవర్’ (Welltower) సీఈవో, భారత సంతతికి చెందిన శంఖ్ మిత్రా (Shankh Mitra) అంతర్జాతీయ కార్పొరేట్ ప్రపంచంలో అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (WSJ) నివేదిక ప్రకారం.. 2025 సంవత్సరానికి గాను ఏకంగా $821 మిలియన్ల (సుమారు రూ.6,800 కోట్లకు పైగా) వార్షిక పరిహార ప్యాకేజీని అందుకుని ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా నిలిచారు.
ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ($158 బిలియన్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆయన తర్వాత స్థానాన్ని శంఖ్ మిత్రా కైవసం చేసుకున్నారు.
కోల్‌కతా ఇంజనీరింగ్ నుంచి అమెరికా కార్పొరేట్ శిఖరాలకు..
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శంఖ్ మిత్రా ప్రస్థానం ప్రారంభమైంది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి ‘అప్లైడ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్’లో ఎంబీఏ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC), ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్లలో పనిచేసి, ఆ తర్వాత సిటాడెల్ (Citadel), మిలీనియం మేనేజ్మెంట్ వంటి ప్రముఖ సంస్థల్లో రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2016లో వెల్‌టవర్‌లో చేరిన ఆయన, 2018లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా (CIO), 2020లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పెట్టుబడి నైపుణ్యాలు సంస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి.
స్టాక్ అవార్డులే ప్రధాన బలం..
-
ఈక్విటీ ఆధారిత ప్యాకేజీ:శంఖ్ మిత్రా అందుకున్న ప్యాకేజీలో దాదాపు 99 శాతం కంపెనీ షేర్ల (స్టాక్ గ్రాంట్స్) రూపంలోనే ఉంది. అక్టోబర్‌లో కేటాయించిన $789 మిలియన్ల విలువైన షేర్లు, కంపెనీ షేర్ల విలువ పెరగడంతో ఏడాది చివరి నాటికి $1 బిలియన్కు పైగా చేరాయి.
-
దీర్ఘకాలిక లక్ష్యాలతో ముడిపడి:ఈ మొత్తం ప్యాకేజీ దీర్ఘకాలిక పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఆయన 2031 వరకు సంస్థలో కొనసాగితేనే సగం షేర్లు అందుతాయి. మిగిలిన సగం వాటా దక్కాలంటే వచ్చే ఐదేళ్లలో కంపెనీ మార్కెట్ విలువ 45 శాతం పెరగడంతో పాటు ప్రముఖ స్టాక్ సూచీల కంటే మెరుగైన పనితీరును కనబరచాల్సి ఉంటుంది.
టాప్-10 గ్లోబల్ సీఈవోలలో మరో భారతీయుడు..
వెల్‌టవర్ సంస్థలోనే మరో ముగ్గురు ఉన్నతాధికారులు $100 మిలియన్లకు పైగా ప్యాకేజీని అందుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్యాకేజీలు పొందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో పలువురు దిగ్గజాలు నిలిచారు..
-
ఎలాన్ మస్క్: $158 బిలియన్లు (టెస్లా)
-
శంఖ్ మిత్రా: $821 మిలియన్లు (వెల్‌టవర్)
-
జార్జ్ కర్ట్జ్: $248 మిలియన్లు
-
హాక్ టాన్: $205 మిలియన్లు
-
డేవిడ్ జాస్లావ్: $165 మిలియన్లు
-
స్టీఫెన్ ష్వార్జ్‌మన్: $126 మిలియన్లు
-
నికేష్ అరోరా: భారత సంతతికి చెందిన పాలో ఆల్టో నెట్వర్క్స్ (Palo Alto Networks) సీఈవో నికేష్ అరోరా $100 మిలియన్ల ప్యాకేజీతో 8వ ర్యాంకులో నిలిచారు.
