supreme court

Supreme Court: దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన FIRలు రద్దు..

Supreme Court: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో నిరసనలు చేపట్టిన విద్యార్థులు, యువతకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అసాధారణ అధికారాలను (Extraordinary Powers) ప్రయోగిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపిన యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ నిరసన ర్యాలీని విరమిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..కేసులన్నీ క్లోజ్ – కొత్త FIRలపై నిషేధం..

జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనలకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన అన్ని కేసులను మూసివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ వ్యవహారంపై దేశంలో ఎక్కడా ఇకపై కొత్తగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని ఆదేశించింది.
తీవ్ర నేరచరిత్ర ఉన్న 2,873 మందిపై మినహాయింపు..
తీవ్ర నేర చరిత్ర ఉండి, ఆందోళనల సమయంలో హింసకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే 2,873 మందిపై మాత్రమే విచారణ జరిపి కొత్త కేసులు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీస్, కేంద్రానికి కోర్టు అనుమతినిచ్చింది. దీనిపై CJP స్పందిస్తూ.. నేరస్థులు ఎవరైనా ఉంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం..
నీట్ పరీక్షల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 3 నెలల్లోగా పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే దేశవ్యాప్త పరిహార యంత్రాంగాన్ని (Pan-India Mechanism) సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.

కేంద్రం ఇచ్చిన 3 హామీలు – నిరసనల విరమణ..

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున కోర్టుకు హామీ ఇస్తూ.. గతంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని, కొత్త కేసులు పెట్టబోమని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.

కేంద్రం మరియు సుప్రీంకోర్టు నిర్ణయాలపై CJP హర్షం వ్యక్తం చేస్తూ దీనిని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించింది. ప్రభుత్వ సానుకూల వైఖరిని స్వాగతిస్తూ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు చేపట్టాల్సిన నిరసన మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. “రెండు వైపులా సద్భావన చూపితే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు” అని సీజేఐ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *