HYDRAA Ranganath: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి రంగనాథ్‌ను తప్పించాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన హైడ్రా కమిషనర్‌గా తన విధులను యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
అసలు వివాదం – కేసు నేపథ్యం..
హైదరాబాద్ పరిధిలోని లోతుకుంట వద్ద గల 40 ఎకరాల భూమిలో ‘శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్’ స్థలంలో హైడ్రా చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలపై యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.
ముందస్తు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారని పేర్కొంటూ బాధితులు కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.
డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన రంగనాథ్ – స్టే మంజూరు..
సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్..
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా చేపట్టిన చర్యలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు.
డివిజన్ బెంచ్ ఊరట..
రంగనాథ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. కమిషనర్ తొలగింపునకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా బృందానికి, ప్రభుత్వానికి న్యాయపరంగా పెద్ద ఉపశమనం దక్కినట్లయింది.
